కలం, వెబ్ డెస్క్: నాలుగు రాష్ట్రాలకు కొత్త చీఫ్ జస్టిస్‌లను నియమిస్తూ సుప్రీం కోర్టు (Supreme Court) కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో ఈ నెల ఆరో తేదీన సమావేశమైన కొలీజియం.. ప్రస్తుతం హై కోర్ట్ న్యాయమూర్తులుగా పనిచేస్తున్న నలుగురికి ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించి, బదిలీ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. అక్కడి నుంచి రాష్ట్రపతికి చేరుతుంది. ఫైల్‌పై రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే నలుగురిని చీఫ్ జస్టిస్‌లుగా గుర్తిస్తూ గెజిట్ వెలువడనుంది. అనంతరం, వీరితో ఆయా రాష్ట్రాల గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
నలుగురు జడ్జిలు ఎవరంటే..
ఢిల్లీ హైకోర్ట్ జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్ వి.కామేశ్వర రావును పాట్నా హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా, బాంబే హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ రవీంద్ర వి.ఘుగేను కలకత్తా హైకోర్టు సీజేగా, అలహాబాద్ హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠిని బాంబే హైకోర్టు సీజేగా, పంజాబ్-హర్యానా హైకోర్టులో పనిచేస్తున్న అశ్విని కుమార్ మిశ్రాను అలహాబాద్ హైకోర్టు సీజేగా నియమించారు. వీరిలో జస్టిస్ వల్లూరి కామేశ్వర రావు తెలుగు వారే కావడం గమనార్హం. ఆయన స్వస్థలం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పొన్నమండ. 1991 లో బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ చీఫ్ జస్టిస్ స్థాయికి చేరుకున్నారు. గతంలో ఓసారి కర్ణాటక హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేశారు.

