Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకులో కుర్చీలాట

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) సహకార అర్బన్ బ్యాంకు (Cooperative Urban Bank) రాజకీయాలు సెగలు రేపుతున్నాయి. కుర్చీ కోసం మాజీ, ప్రస్తుత పాలకవర్గాల మధ్య వార్ పీక్స్‌కు చేరింది. ఒకవైపు హైకోర్టు.. మరోవైపు ట్రిబ్యూనల్ ఉత్తర్వులతో బ్యాంకు పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. పాత కమిటీకి బాధ్యతలు అప్పగించాలంటూ ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పుతో సీఈఓ వద్దకు మాజీ చైర్మన్ పరుగులు తీయగా.. జిల్లా అధికారులు మాత్రం ఈ హాట్ పొటాటోను హైదరాబాద్ మీదికి నెట్టేశారు. అసలు కరీంనగర్ అర్బన్ బ్యాంకులో ఏం జరుగుతోంది? అన్న చర్చ జరుగుతొంది.

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకులో పొలిటికల్ హీట్ 100 డిగ్రీలకు చేరింది. ప్రస్తుత చైర్మన్ కర్ర రాజశేఖర్ నేతృత్వంలోని పాలకవర్గానికి, మాజీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డికి మధ్య నడుస్తున్న ఈ ‘కుర్చీలాట’ ఇప్పుడు కరీంనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది మార్చిలో కోరం లేక సర్వసభ్య సమావేశం వాయిదా పడటాన్ని అస్త్రంగా చేసుకున్న మాజీ చైర్మన్ విలాస్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బైలా నిబంధనల ప్రకారం సమావేశం జరపకపోతే మరుసటి రోజే పాలకవర్గం పదవి కోల్పోతుందనే పాయింట్‌ను కోర్టు ముందుంచారు. దీనిపై హైకోర్టు కూడా సీరియస్‌గా స్పందించి.. పర్సన్ ఇన్ చార్జ్ లేదా స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని సహకార శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పది రోజులైనా ఈ ఉత్తర్వులు ఇంకా బయటకు రాకపోవడంతో.. అవి రాగానే స్టే తెచ్చుకోవాలని ప్రస్తుత పాలకవర్గం వ్యూహాలు రచిస్తోంది.

వరంగల్ సహకార ట్రిబ్యూనల్ నుంచి వచ్చిన తీర్పు ప్రస్తుత పాలకవర్గానికి పెద్ద షాక్ ఇచ్చింది. గత నవంబర్ 1న జరిగిన ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ విలాస్ రెడ్డి వేసిన పిటిషన్‌పై ట్రిబ్యూనల్ సంచలన తీర్పునిచ్చింది. 45 రోజుల్లో ముగించాల్సిన ఎన్నికల ప్రక్రియను కేవలం 14 రోజుల్లోనే ముగించారని, నోటిఫికేషన్‌ను కూడా గోప్యంగా ఉంచారని ట్రిబ్యూనల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సహకార అధికారుల తప్పిదాల వల్లే ఈ బోర్డు గెలిచిందని స్పష్టం చేస్తూ.. ప్రస్తుత కమిటీని పక్కనబెట్టి, పాత కమిటీకే బాధ్యతలు అప్పగించాలని ఆర్డర్ ఇచ్చింది. దీంతో ప్రస్తుత పాలకవర్గ ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు.

ట్రిబ్యూనల్ తీర్పు కాపీ చేతికందడమే ఆలస్యం..

మాజీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి సోమవారం నేరుగా బ్యాంకు సీఈఓ శ్రీనివాస్‌ను కలిశారు. తనకు తక్షణమే చార్జ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే, తనకు ఆ అధికారాలు లేవని, జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వస్తేనే అమలు చేస్తానని సీఈఓ చేతులెత్తేశారు. దీంతో ఈ వివాదం జిల్లా సహకార అధికారి (DCO) వద్దకు చేరింది. కానీ, అక్కడ కూడా ట్విస్ట్ ఎదురైంది. డీసీఓ ఈ వివాదంలో తలదూర్చకుండా.. తదుపరి చర్యల కోసం యావత్ నివేదికను హైదరాబాద్‌లోని రాష్ట్ర సహకార శాఖ ఉన్నతాధికారుల మీదికి తోసేశారు. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. మొత్తానికి.. హైకోర్టు ఉత్తర్వులు వెలుగు చూడక ముందే ట్రిబ్యూనల్ ఇచ్చిన షాక్‌తో అర్బన్ బ్యాంకు రాజకీయం మరింత ముదిరింది. ఒకవైపు హైదరాబాద్ నుంచి వచ్చే ఆదేశాల కోసం అధికారులు చూస్తుంటే.. మరోవైపు కోర్టు నుంచి స్టే తెచ్చుకోవాలని పాలకవర్గం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ హైటెన్షన్ పాలిటిక్స్‌లో సీటు దక్కేది ఎవరికి? అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అనేది ఇప్పుడు జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>