‎పరిశీలనతోనే నిజమైన చరిత్ర నిర్మాణం: భాంగ్యా భూక్యా

‎కలం, నల్లగొండ: ఉత్తర భారత దేశంలో జరిగిన పరిణామాలనే దేశ చరిత్రగా చిత్రీకరించే ధోరణి విడనాడాలని ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ భాంగ్యా భూక్యా (Professor Bangya Bhukya) పిలుపునిచ్చారు. దక్షిణ భారతదేశం, అణగారిన వర్గాలు, స్థానిక సమాజాల చారిత్రక అనుభవాలకు సముచిత స్థానం లభించాలన్నారు. చరిత్ర అంటే కేవలం కథనాలు కాదని, విశ్వసనీయ ఆధారాలు, శాస్త్రీయ పద్ధతి, విమర్శనాత్మక పరిశీలనతో నిర్మించాల్సిన జ్ఞానమని స్పష్టం చేశారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న 45వ దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు.

యుద్ధాలకే పరిమితం చేయొద్దు..

ప్రొఫెసర్ భాంగ్యా భూక్యా మాట్లాడుతూ.. క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశంలో జరిగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పల్లవులు, చోళులు, కాకతీయుల వంటి రాజవంశాల చరిత్రను కేవలం యుద్ధాలకే పరిమితం చేయకుండా, నాటి సముద్ర వాణిజ్యం, వర్తక సంఘాలు, విదేశీ సంబంధాల కోణంలోనూ పరిశోధించాలన్నారు.

ఈ పరిణామాల వెనుక ఉన్న వర్తకులు, శిల్పులు, చేతివృత్తిదారులు, శ్రామిక సమూహాల పాత్రలను వెలికితీయాలని భాంగ్యా భూక్యా సూచించారు. జైన, బౌద్ధ సాహిత్యం, జాతక కథల్లో నాటి ప్రజల జీవన విధానం, వృత్తులకు సంబంధించిన విలువైన ఆధారాలు ఉన్నాయని, విభిన్న ఆధారాలను పరస్పరం సరిపోల్చి చూసినప్పుడే సమగ్ర చరిత్ర ఆవిష్కృతమవుతుందని పేర్కొన్నారు.

యువ పరిశోధకులకు సూచన..

సదస్సు అధ్యక్షుడు ఆచార్య విక్టర్‌బాబు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల చరిత్రలను వెలికితీసేందుకు యువ పరిశోధకులు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్థానిక చరిత్రలు, విభిన్న సామాజిక అనుభవాలను అన్వేషించేందుకు దక్షిణ భారతదేశం విస్తృత అవకాశాలను అందిస్తోందని పేర్కొన్నారు. ఇక ‎ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని ప్రొఫెసర్ విజయబాబు, స్థానిక కార్యదర్శి డాక్టర్ పనస రామకృష్ణ తెలిపారు.

838 మంది హాజరు కాగా, వీరిలో 407 మంది మహిళలు, ఐదుగురు దివ్యాంగులు ఉండటం విశేషం. 113 పత్రాలను పీజీ, పీహెచ్‌డీ పరిశోధకులు, అధ్యాపకులు సమర్పించారు. డాక్టర్ అరుణప్రియ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ ఆచార్య అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి, ఆచార్య అలువాల రవి, ఆచార్య సదాశివన్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ షరీఫ్, వివేక్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>