కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది (Nitai Roy Chowdhury). ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) .. 297 స్థానాలకు గాను 212 సీట్లు గెలుచుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం దేశ రాజధాని ఢాకాలో జరిగిన కార్యక్రమంలో బీఎన్పీ అధినేత తారిఖ్ రహ్మాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 49 మంది మంత్రులతో ప్రెసిడెంట్ మహ్మద్ షాబుద్దీన్ ప్రమాణం చేయించారు. అయితే, మంత్రులెవరికీ శాఖలు కేటాయించలదు.
కాగా, దాదాపు 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు (Bangladesh) పురుషుడు ప్రధాని కావడం గమనార్హం. అంతకుముందు అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా, బీఎన్పీ నాయకురాలు ఖలీదా జియాలు ఒకరి తర్వాత ఒకరు పీఎంగా ఉన్నారు. ఏడాదిన్నర కిందట విద్యార్థుల ఆందోళనతో ప్రధాని పదవిని, దేశాన్ని వదిలి భారత్‌లో షేక్ హసీనా తలదాచుకోగా, అనంతరం పరిణామాల్లో ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రహ్మాన్ (Tarique Rahman) దాదాపు 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చారు. తల్లి మరణించాక, పార్టీ బాధ్యతలు చేపట్టి అధికారంలోకి తీసుకొచ్చారు.
హిందూ.. బౌద్ధం
కొత్త కేబినెట్లో ఇద్దరు మైనారిటీ వర్గానికి చెందిన వాళ్లు ఉండడం విశేషం. వీళ్లలో ఒకరు హిందూ ఎంపీ నితాయ్ రాయ్ చౌధురి (Nitai Roy Chowdhury), మరొకరు బౌద్ధ మతానికి చెందిన దీపేన్ దేవన్ చక్మా.
1949లో పుట్టిన నితాయ్ రాయ్ చౌధురి ప్రముఖ లాయర్. రాజకీయాల్లో ప్రవేశించాక బీఎన్పీలో కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షుల్లో ఒకరు. అలాగే బీఎన్పీ విధానపర నిర్ణయాలు తీసుకునే కమిటీలో మెంబర్. గతంలో ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం వెస్ట్ మగుర స్థానం నుంచి జమాతే ఇస్లామీ అభ్యర్థిపై గెలిచారు.
దీపెన్ దేవన్ 1963లో పుట్టారు. బౌద్ధమతంలోని చక్మా వర్గానికి చెందిన దీపెన్.. రంగమతి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. దీపెన్ తండ్రి సుబిమల్ దేవన్ బంగ్లాదేశ్ మాజీ ప్రెసిడెంట్ జియావుర్ రహ్మాన్ వద్ద గిరిజన సంక్షేమ సలహాదారుగా పనిచేశారు.
కాగా, తారిఖ్ రహ్మాన్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. అలాగే చైనా, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక తరఫున సైతం ప్రతినిధులు వచ్చారు.
Read Also: ముంబై రోడ్లపై పరుగులు తీసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
Follow Us On : WhatsApp


