కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly) భాగంగా బుధవారం హిల్ట్ పాలసీపై జరగబోతున్నది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ కార్యకలాపాల ప్రారంభంలో సంప్రదాయం ప్రకారం ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ, ఎంఐఎం సభ్యులు మాత్రమే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలు, ప్రభుత్వ పథకాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది.
ప్రశ్నోత్తరాల అనంతరం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. రాష్ట్రంలో ఆరోగ్య, ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్ రంగాల అభివృద్ధి లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ పాలసీపై సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించనున్నారు. పరిశ్రమల ఆకర్షణ, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలు అసెంబ్లీలో (Telangana Assembly) ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
అదేవిధంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’పై కూడా స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు. రాష్ట్ర భవిష్యత్ దిశ, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు, 2047 నాటికి తెలంగాణ సాధించాల్సిన లక్ష్యాలపై ఈ చర్చ కొనసాగనుంది. ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, ఉపాధి, సంక్షేమం వంటి అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ పాల్గొనకపోవడంతో కాస్త చప్పచప్పగానే సాగుతున్నాయి. ప్రతిపక్షపార్టీ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కోల్పోయిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.


