కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)కి హై కోర్టులో షాక్ తగిలింది. ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. తన వాయిస్ శాంపిల్ కావాలని కరీంనగర్ పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని కౌశిక్ రెడ్డి హై కోర్టులో సవాల్ చేశారు. దీనిపై కొద్ది రోజులుగా ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. కౌశిక్ రెడ్డి పిటిషన్ కొట్టేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. విచారణలో భాగంగా కేసు నమోదైన వ్యక్తి వాయిస్ శాంపిల్ అడిగే అధికారం పోలీస్ అధికారులకు ఉంటుందన్న లాయర్ వాదనను ధర్మాసనం సమర్థించింది. దీంతో ఈ కేసులో పోలీసులు మరింత వేగంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.
అసలు ఏం జరిగిందంటే..
కరీంనగర్ సీపీ గౌష్ ఆలం (CP Gaush Alam) లక్ష్యంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఆయన పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారని, తన వద్ద కొన్ని రహస్య వీడియోలు, ఫొటోలు కూడా ఉన్నాయని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయనపై వీణవంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు ప్రాధాన్యత దృష్ట్యా సీఐడీకి బదిలీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడిన వీడియో రికార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వాయిస్ శాంపిల్ ఇవ్వాలని నోటీసులిచ్చారు. ఈ నోటీసులను హై కోర్టులో సవాల్ చేయగా.. కోర్టు తాజాగా ఆయన పిటిషన్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో కౌశిక్ సుప్రీం కోర్టుకు వెళ్తారా.. లేకపోతే వాయిస్ శాంపిల్ ఇస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్ వేడుకలో సినీ ప్రముఖల సందడి
Follow Us On : WhatsApp

