కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలలో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దాటి మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తును (Anti Maoist Operations) ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు, ఇంకా లొంగిపోని మావోయిస్టులు ఎక్కడున్నారు అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల వద్ద ప్రత్యేక బలగాలు మోహరించి గట్టి పహారా కాస్తున్నాయి.మావోయిస్టుల చొరబాటును అడ్డుకోవడానికి అటవీ ప్రాంతాలను పోలీసు బలగాలు జల్లడ పడుతున్నాయి. సరిహద్దు గ్రామాల్లో అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టి, తనిఖీలను ముమ్మరం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం ఆధునిక ఆయుధాలు, అవసరమైన సామగ్రితో అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం.

