కలం, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట (Dammapeta) మండల తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా దళారుల రాజ్యం నడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ అమాయకులను నిలువునా దోచుకుంటున్న అక్రమ దందా ఇప్పటికే వెలుగులోకి రాగా.. నూతన తహసీల్దార్‌గా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళి బాధ్యతలు స్వీకరించిన తరువాత డొంక కదులుతోంది.
తాజాగా ముష్టిబండ గ్రామానికి చెందిన రైతు గండిపుడి వెంకటేశ్వరరావు ఈ దళారీల దందాకు బాధితుడిగా మారారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నెంబర్ 143లో ఉన్న తన అర ఎకరం వ్యవసాయ భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పిస్తానంటూ ఇదే గ్రామానికి చెందిన నందమూరి రాము అనే దళారీ నమ్మించాడు. ఇందుకు రూ.50 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని, ముందస్తుగా కొంత వసూలు చేసి అధికారులతో సర్వే కూడా పూర్తి చేయించాడు.
మరో రూ.50 వేలు డిమాండ్..
అయితే, నెలలు గడుస్తున్నా పని పూర్తి కాకపోవడంతో రామును వెంకటేశ్వరరావు నిలదీశారు. పని పూర్తి కావాలంటే అధికారులకు ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ మరో రూ.50 వేలు డిమాండ్ చేశాడు. దీంతో తాను మోసపోయానని వెంకటేశ్వరరావు మనోవేదన చెందుతున్నారు. ఇప్పటికే చెల్లించిన రూ.50 వేలతో అప్పుల పాలైన ఆయన కాలి గాయంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కొత్త తహసీల్దార్ స్పందించి నాకు న్యాయం చేయాలని.. నా భూమికి పట్టా ఇప్పించి ఆదుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, రెవెన్యూ కార్యాలయం కేంద్రంగా అధికారుల పేర్లు చెబుతూ దళారులు బహిరంగంగానే వసూళ్లకు తెగబడుతున్నారని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ తక్షణమే స్పందించి దళారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత రైతుకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దళారుల రాజ్యం..?
-దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ అమాయకులను నిలువునా దోచుకుంటున్న దళారులు
-రెవెన్యూ కార్యాలయం కేంద్రంగా అధికారుల పేర్లు చెబుతూ దళారులు బహిరంగంగానే వసూళ్లు
-దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న… pic.twitter.com/oPRF0oBiK3— Kalam Daily (@kalamtelugu) August 4, 2026

