కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) రూరల్ మండలం చిట్యాల గ్రామంలో మైనర్ బాలుడిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి పోక్సో ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల కేసు వివరాలను మీడియాకు తెలిపారు. గతేడాది జనవరిలో చిట్యాల గ్రామానికి చెందిన మైనర్ బాలుడిపై అదే గ్రామానికి చెందిన తోకల రాజేశ్వర్ అలియాస్ రాజు అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. ఈ ఘటనపై అప్పటి ఎస్సై లింబాద్రి పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు.
అనంతరం రూరల్ సీఐ రామకృష్ణ, ఏఎస్పీ రాజేశ్ మీనా దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదర్శన్ రెడ్డి సాక్ష్యాధారాలతో నేరాన్ని రుజువు చేశారు. దీంతో నిర్మల్ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్రీవాణి నిందితుడు రాజేశ్వర్‌కి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

