కలం, వెబ్ డెస్క్ : మకావ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నీలో భారత షట్లర్ అశ్మిత చాలిహా (Ashmita Chaliha) అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్ సన్‌పై 21-16, 21-18 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ 14-14 వరకు హోరాహోరీగా సాగింది. ఆ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన అశ్మిత ఆధిక్యం సంపాదించి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది.
రెండో గేమ్‌లో కిమ్ 11-5తో ముందంజలో ఉన్నా, అశ్మిత పోరాట పటిమ చూపించింది. 16-18 వద్ద ఉన్న సమయంలో వరుసగా ఐదు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను ముగించింది. అస్సాంకు చెందిన 26 ఏళ్ల అశ్మిత మూడు నెలల గాయ విరామం తర్వాత మేలో తిరిగి బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 63వ స్థానంలో ఉన్న ఆమె, ఈ సీజన్‌లో ఇప్పటికే చైనా మాస్టర్స్, మలేషియా మాస్టర్స్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు మకావ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరి మరో కీలక అడుగు వేసింది.
ఫైనల్ బెర్త్ కోసం అశ్మిత తదుపరి మ్యాచ్‌లో దక్షిణ కొరియాకు చెందిన పార్క్ గా యూన్‌తో తలపడనుంది. మరోవైపు భారత క్రీడాకారిణి అన్మోల్ ఖర్బ్ ప్రయాణం క్వార్టర్ ఫైనల్‌తో ముగిసింది. చైనాకు చెందిన హాన్ కియాన్ షి చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అశ్మిత ప్రస్తుత ఫామ్ భారత బ్యాడ్మింటన్ అభిమానుల్లో ఆశలు పెంచుతోంది. సెమీఫైనల్‌లో కూడా అదే జోరు కొనసాగించాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

