శ్రీరామనవమి స్పెషల్.. వడపప్పు, పానకం ఆరోగ్య లాభాలు

కలం, వెబ్ డెస్క్ : శ్రీరామ నవమి (Sri Rama Navami).. తెలుగు సంవత్సరంలో వచ్చే రెండో పండగ. ఎండాకాలం ప్రారంభంలో వచ్చే ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని వడపప్పు, పానకం తీసుకోవడం ఆనవాయితీ. అయితే ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

శ్రీరామనవమి సందర్భంగా పచ్చి పెసరపప్పును రెండు గంటల పాటు నానబెట్టి వడపప్పు తయారు చేస్తారు. అనంతరం నీటిని వంపేసి, కీరదోసకాయ ముక్కలు, తురిమిన కొబ్బరి, కొద్దిగా ఉప్పు కలిపి వడ్డిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అరటి పండు, బెల్లం, కొబ్బరి ముక్కలు వంటి పదార్థాలను కూడా జోడిస్తారు. కొందరు రుచికోసం నిమ్మరసం కూడా కలుపుతారు. ఈ వడపప్పు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్ల శక్తిని అందిస్తుంది. తేలికగా జీర్ణమవడం వల్ల వేసవిలో ఇది ఎంతో ఉపయోగకరం. కీర, కొబ్బరి కలయిక శరీరానికి తాజాదనాన్ని పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

పానకం తక్కువేమీ కాదు

పానకం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పానీయం. బెల్లాన్ని నీటిలో కరిగించి, అందులో మిరియాల పొడి, యాలకుల పొడి, కొద్దిగా నిమ్మరసం కలిపి తయారు చేస్తారు. చల్లగా వడ్డించినప్పుడు ఇది మరింత రుచిగా ఉంటుంది. పానకం తక్షణ శక్తిని అందించడంతో పాటు వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మిరియాలు, యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దాహాన్ని తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. అందువల్ల పానకం వేసవిలో శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

వడపప్పు, పానకం వంటి ఈ సంప్రదాయ వంటకాలు పూర్వీకులు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసినవిగా భావించవచ్చు. తక్కువ వంటతో సహజ పదార్థాలతో తయారవడం వీటి ప్రత్యేకత. అందుకే ఇవి ప్రసాదంగా మాత్రమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలుగా కూడా ప్రాముఖ్యత పొందాయి. పండుగల సమయంలో మాత్రమే కాకుండా, వేసవిలో ఎప్పుడైనా ఈ వంటకాలను తీసుకోవడం శరీరానికి ఎంతో ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>