కలం, వెబ్ డెస్క్: ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎండల నుంచి కాస్త ఉపశమమం లభించిందని భావించినా.. రైతులకు మాత్రం అకాల వర్షాలు కన్నీళ్లే మిగిల్చుతున్నాయి. ఆరుగాలం కష్టపడిన పంట చేతికందే సమయంలో వర్షాలు పంటను పూర్తిగా నేలమట్టం చేశాయని.. నోట్లోకి వెళ్లాల్సిన ముద్ద, నేలపై పడిందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. విశాఖ పట్నం, విజయవాడ, గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో భారీ పంట నష్టం వాటిల్లింది . ఈదురుగాలులతో కూడిన వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.
అటు కోనసీమ పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరు, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. పోలవరం జిల్లా గంగవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో వడగళ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. వర్షాలతో చేతికందిన పంట నేలపాలైందని లబోదిబోమంటున్నారు. మిర్చి, మొక్క జొన్న సహా ఉద్యానవన పంటలు నేలకొరిగాయి. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు కూడా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట అమ్ముకునే సమయంలో వర్షాలు పడ్డాయని, రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఏపీలోని వివిధ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. గంటకు గరిష్టంగా 60 కిలో మీటర్ల నుంచి 70 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. శనివారం పార్వతీపురం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, గుంటూరు, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఆదివారం కూడా విస్తారంగా వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
అకాల వర్షాలు, వడగళ్ల వానలతో జరిగిన పంట నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. పంటనష్టంపై గురువారం సమీక్ష చేపట్టారు. కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాలను సీఎంకు వివరించారు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని సీఎం తెలిపారు. 1,215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా, 2,043 మంది రైతులు నష్టపోయారని చెప్పారు. అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైనా అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని, మొత్తం 307 మంది రైతులకు చెందిన 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎంకు వివరించారు.

