కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షాలు (Heavy rains) బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రనుంచి అర్థరాత్రి వరకు భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నగర ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేశాయి. చందానగర్, జేఎన్టీయూ, జీడిమెట్ల, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, నాంపల్లి, అబిడ్స్, బషీర్‌బాగ్, మియాపూర్, కేపీహెచ్‌బీ, సనత్‌నగర్, బోరబండ, పంజాగుట్ట, కోఠి, మలక్‌పేట, సరూర్‌నగర్, చంపాపేట, నారాయణగూడ ప్రాంతాల్లో వర్షం కురుసింది. భారీ వర్షం దాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. నగరంలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గాలులకు బోర్డులు, హోర్డింగులు ఎగిరిపడ్డాయి. సిటీలో చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రంతా అంధకారంలోనే పలు ప్రాంతాలు ఉన్నాయి.
నేలకూలిన శతాబ్దాల నాటి వృక్షం..
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఎస్డీఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి రాత్రంతా వాటర్ లాగింగ్ క్లియర్ చేశారు. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలు, గాలులకు చార్మినార్ సమీపంలోని చారిత్రాత్మక యునానీ టిబ్బీ ఆసుపత్రి వద్ద ఉన్న శతాబ్దాల నాటి భారీ వృక్షం నేలకూలింది. దీంతో అక్కడ పార్క్ చేసి ఉన్న పలు వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే మీర్ జుల్ఫికార్ అలీ ఘటన స్థలానికి చేరుకుని సహాయక బృందాలను, జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు వెంటనే చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
నేడు కూడా వర్షాలు..
శనివారం కూడా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. శని, ఆదివారాల్లో హైదరాబాద్ తో పాటు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
హైడ్రా బిగ్ ఆపరేషన్..
శుక్రవారం రాత్రి సమయంలో కురిసిన భారీ వర్షంతో హైడ్రా సహాయక చర్యలు చేపట్టింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి నేలకొరిగిన చెట్లతో పాటు వాటర్ లాగింగ్ పాయింట్లను వెనువెంటనే క్లియర్ చేసింది. రాత్రి 11.30 గంటల వరకూ 26 చెట్లు నేలకొరిగిన ఫిర్యాదులు రాగా వాటిలో 21 వరకూ పూర్తి చేశారు. మెహిదీపట్నం, అత్తాపూర్ లో వాటర్ లాగింగ్ పాయింట్లను క్లియర్ చేసింది. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 1లోని వెంగలరావు పార్కు సమీపంలో నేలకొరిగిన చెట్లను తొలగించి నిమ్స్ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించింది. కొండాపూర్, మియాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్, గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్రాంతాల్లో వరద పోటెత్తడానికి గల కారణాలను తెలుసుకొని పూడికను తొలగించింది.
యాదగిరిగుట్టపై రెయిన్ ఎఫెక్ట్..
ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టపై కూడా వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం 6గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో భక్తులు ఉరుకులు, పరుగులు పెట్టారు. గాలి దుమారానికి కొండపై ఉన్న ఐదు తాత్కాలిక దుకాణాల టెంట్లు లేచిపోయాయి. అలాగే, జర్మన్ ఫ్యాబ్రిక్ హ్యాంగర్స్‌తో ఏర్పాటు చేసిన షెడ్డు బేస్‌కు బిగించిన సుమారు 8 స్టీల్ పిల్లర్లు పైకి లేచాయి. తూర్పు వీధిలోని ఎల్‌ఈడీ స్ర్కీన్ షార్ట్ సర్క్యూట్‌కు గురై అందులో నుంచి పొగలు చెలరేగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టింది. గడిచిన 24గంటల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా పెద్దవూర మండలం పులిచెర్లలో అత్యధికంగా 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడవిదేవులపల్లి మండలం ముల్కచర్లలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రైతన్న ఆగమాగం..
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో చెట్లు, ట్రాన్స్‌ఫార్మార్లు నేలకొరిగాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్, ఎండపల్లి, గొల్లపల్లి, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, మల్యాల తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్, గంగాధర, ధర్మారం తదితర మండలాల్లో వర్షం దంచికొట్టింది. సూర్యాపేట జిల్లాలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి, ఈదురుగాలుల దెబ్బకు 780 విద్యుత్ స్తంభాలు, 30 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా విద్యుత్ శాఖకు రూ.80లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. రాఘవాపురంలో వర్షానికి తడిసిన గోడ కూలగా.. ఆ శిథిలాలు పడి అనుముల మల్సూర్(75) అనే వృద్ధుడు మరణించాడు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులపై కప్పిన పరదాలు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.

