కలం, జనగామ బ్యూరో: జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా ధాన్యం రాశులు తడిసిపోయాయి. మార్కెట్ యార్డు (Market Yard) లో రైతులు అమ్మకానికి తీసుకువచ్చిన వేలాది క్వింటాళ్ల ధాన్యాన్ని తాత్కాలికంగా టార్ఫాలిన్ కవర్లతో కప్పి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే భారీ గాలులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల ధాన్యం వర్షపు నీటిలో తడిసిపోయింది.
ధాన్యం తడవడంతో నాణ్యత తగ్గిపోతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందని, ఇప్పుడు వర్షం వల్ల మరింత నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో సరిపడా గోదాములు, శాశ్వత షెడ్లు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు. వర్షం ఆగిన వెంటనే రైతులు తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని రక్షించే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

