హైదరాబాద్‌లో ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు

కలం, కరీంనగర్ బ్యూరో : ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా) అనుబంధ సంస్థ అయిన తెలంగాణ ప్రజానాట్య మండలి (Praja Natya Mandali) రాష్ట్ర మహాసభలు ఈ నెల 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో జరగనున్నాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ (Palle Narsimha) తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కళాకారులకు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణా శిబిరం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా కళాకారులకు పాటలు పాడటం, డప్పు వాయించడం వంటి అంశాలలో శిక్షణ ఇచ్చారు.

శిక్షణ ముగింపు కార్యక్రమంలో పల్లె నర్సింహ మాట్లాడుతూ, దేశంలో మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు కలిసి ఇప్టాను స్థాపించారని చెప్పారు. ప్రజల సమస్యలు, కార్మికులు–కర్షకుల జీవన విధానాలపై అధ్యయనం చేస్తూ ప్రజా చైతన్యానికి దోహదపడే రచనలు, పాటలు రూపొందిస్తున్నారని వివరించారు. ‘కళ కాసుల కోసం కాదు.. ప్రజల కోసం’ అనే భావనతో పాటలు పాడే వారే నిజమైన ప్రజా కళాకారులని ఆయన అన్నారు. ఇలాంటి కళాకారులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ప్రజా సమస్యలను సమాజానికి తెలియజేయాలని సూచించారు.

రాష్ట్రంలో జానపద, యక్షగాన, బుర్రకథ, ఒగ్గుకథ, వీధి భాగోత కళాకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని రంగాల కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డులు, పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజల కష్టసుఖాలను పాటల రూపంలో ప్రజలలోకి  తీసుకెళ్లే శక్తి కళాకారులకే ఉందని అన్నారు. ఉద్యమాలు, పోరాటాలు విజయవంతం కావాలంటే కళాకారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు, ప్రజానాట్య మండలి నాయకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>