కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సొంత పార్టీ నేతల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy), మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) వైఖరిపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ (Mandula Samuel) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా తమ రాజ్యంగా భావిస్తూ దళిత నియోజకవర్గాలపై కోమటిరెడ్డి బ్రదర్స్ పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని, ఈ అహంకారపూరిత వైఖరిని సహించేది లేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో మరణించిన మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిల పర్యటనపై సామేల్ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో పర్యటించడం వెనుక రాజకీయం ఉందన్నారు. “కోమటిరెడ్డి బ్రదర్స్ మా గురించి ఎందుకు హీనంగా మాట్లాడుతున్నారు? మీ దగ్గర చేతులు చాచి మేం గెలవలేదు. మేము దళిత నియోజకవర్గాల ప్రతినిధులం కాబట్టే ఇలా చిన్నచూపు చూస్తూ హక్కులను హరిస్తున్నారా? తుంగతుర్తి నియోజకవర్గం ఆగమవుతోందని గాంధీభవన్లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం.” అని మందుల సామేల్ విరుచుకుపడ్డారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై సామేల్ తీవ్రస్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. “గతంలో బీజేపీలోకి పోయి రాహుల్ గాంధీని తిట్టి, ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చిన వ్యక్తికి నా నియోజకవర్గం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అసలు మునుగోడులో అభివృద్ధి జరగలేదు, అక్కడ పరిస్థితి బాగాలేదని నాకు కూడా రిపోర్టులు వచ్చాయి. మునుగోడులో నీ మురికి నువ్వు కడుక్కో.. అక్కడ బీజేపీ నుంచి నీతో వచ్చిన వారికే మండల పార్టీ అధ్యక్ష పదవులు ఇవ్వలేదా?” అని ప్రశ్నించారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించిన మండల అధ్యక్షులే తుంగతుర్తిలో కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు.
రోడ్ల మరమ్మతులపై మంత్రి వెంకట్ రెడ్డి వైఖరిని సామేల్ నిలదీశారు. మోత్కూరు నుంచి భోనగిరి వెళ్లే రహదారి గుంతలమయంగా మారిందని, దాని మరమ్మతుల కోసం మంత్రి దృష్టికి వందలసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు పరామర్శల పేరుతో వచ్చి రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నల్లగొండ జిల్లా అంటే శ్రమజీవుల జిల్లా, పోరాటాల గడ్డ అని, ఎవరి పెత్తనాన్ని ఇక్కడ సహించేది లేదని హెచ్చరించారు. తన నియోజకవర్గంలో తమ గౌరవానికి, ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తున్న కోమటిరెడ్డి సోదరుల వ్యవహారాన్ని ఊరుకునేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ మొత్తం పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. అధిష్టానం జోక్యం చేసుకుని ఈ బహుళ పెత్తనానికి చెక్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

