Mobile Popup Ad
Mobile Popup Ad

నట్స్ తినే సరైన సమయం ఏది? నిపుణులు చెప్పిన ఆరోగ్య రహస్యాలు

కలం, వెబ్‌డెస్క్: నట్స్ ఆరోగ్యానికి (Benefits of Nuts) ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ప్రధానమైనవి బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, పిస్తా, వేరుశెనగలు. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మంచి కొవ్వులు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిలో ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. అయితే నట్స్ తినే సమయం, పద్ధతి మీద ఆధారపడి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అసలు నట్స్ ను ఏ సమయంలో తినాలి, ఎంత పరిమాణంలో తినాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే నట్స్ ను ఎప్పుడు తినాలి, ఎంత పరిమాణంలో తినాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం (Almonds)

మెదడు పనితీరును మెరుగుపరిచి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో బాదం ఎంతగానో ఉపయోగపడుతుంది. బాదంలో విటమిన్ E, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. సాధారణంగా 100 గ్రాముల బాదంలో సుమారు 22 గ్రాముల ప్రోటీన్, 50 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు, 20 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 10 గ్రాముల ఫైబర్ ఉంటాయి. షుగర్ వ్యాధిని నియంత్రించాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య 6 నుంచి 8 నానబెట్టిన బాదాలను తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి గుండె ఆరోగ్యానికి, చర్మానికి చాలా మంచివి.

వాల్‌నట్స్ (Walnuts)

మెదడు పనితీరును మెరుగుపర్చడంలో వాల్‌నట్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి తగ్గించి నాణ్యమైన నిద్రకు కూడా సహాయపడతాయి. 100 గ్రాముల వాల్‌నట్స్‌లో సుమారు 15 గ్రాముల ప్రోటీన్, 65 గ్రాముల మంచి కొవ్వు, 7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. రోజుకు 4 నుంచి 5 వాల్‌నట్స్‌ను సాయంత్రం లేదా రాత్రి భోజనం తర్వాత తినడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

జీడిపప్పు (Cashews)

జీడిపప్పులో ఐరన్, మెగ్నీషియం, జింక్, ప్రోటీన్ లభిస్తాయి. ఇవి శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇవి సహాయపడతాయి. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత లేదా సాయంత్రం అల్పాహారంగా 5 నుంచి 6 జీడిపప్పులు తినడం చాలా మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. జీడిపప్పులో క్యాలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని మితంగా తినాలని చెబుతున్నారు.

వేరుశెనగలు (Peanuts)

కొన్ని ప్రాంతాల్లో వీటిని పల్లీలు అని కూడా అంటారు. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు అందించే ఆహారాల్లో వేరుశెనగలు ప్రధానమైనవి. వేరుశెనగల్లో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ B3 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో గుప్పెడు వేరుశెనగలు తినడం ఎంతో మంచిదని చెబుతున్నారు. కానీ బరువు తగ్గాలనుకునేవారు మాత్రం పరిమితంగా తీసుకోవాలని చెబుతున్నారు.

పిస్తా (Pistachios)

శరీరంలో శక్తిని పెంచి కండరాల పనితీరును మెరుగుపర్చడంలో పిస్తా పప్పు చాలా బాగా సహాయపడుతుంది. పిస్తాలో పొటాషియం, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు, క్రీడాకారులు, జిమ్‌ వర్కౌట్లు చేసేవారు మధ్యాహ్నం సమయంలో లేదా వ్యాయామానికి ముందు కొన్ని పిస్తా పప్పులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

నట్స్ లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. సాధారణంగా 100 గ్రాముల నట్స్ లో సుమారు 500 నుంచి 600 క్యాలరీలు ఉంటాయి.అందుకే రోజుకు 20 నుంచి 30 గ్రాముల నట్స్ మాత్రమే తినాలని సూచిస్తున్నారు నిపుణులు. అయితే నూనెలో వేయించిన, ఉప్పు వేసిన నట్స్ తినడం కంటే సహజమైన లేదా నానబెట్టిన నట్స్ తినడం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>