కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల సమయానికి బీజేపీలో చేరతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు. తన జీవితమంతా కేసీఆర్ వెంటేనని.. తన పుట్టుక, ప్రయాణం అంతా బీఆర్ఎస్‌తోనే అని వందసార్లు చెప్పాను, మళ్లీ చెబుతున్నానని స్పష్టం చేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం రేవంత్ రెడ్డికి అలవాటు అంటూ మండిపడ్డారు. “నా పుట్టుక, చావు బీఆర్ఎస్‌లోనే. నాలుగు పార్టీలు మారిన ఆయన నా గురించి మాట్లాడతారా? తన మాటలకు విలువ ఉంటుందా? రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు” అంటూ ఫైర్ అయ్యారు. పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. దేవుళ్ల మీద ఒట్టేసి రుణమాఫీ ఎగబెట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన ఇంటి పేరును అబద్ధాల రేవంత్ రెడ్డిగా మార్చుకోవాలని విమర్శించారు. 45 రోజుల్లో రైతు బంధు ఇస్తానని సిద్దిపేటకొచ్చి మాట తప్పింది నువ్వు కాదా? అంటూ ప్రశ్నించారు. గత కాంగ్రెస్ పాలనలో తండ్రి చనిపోతే స్నానం చేయడానికి కరెంట్ లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని వచ్చామని సాక్షాత్తూ రేవంత్ రెడ్డే అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. ఆ చీకటి రోజులను పోగొట్టి కేసీఆర్ విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేశారని అన్నారు.
రైతు డిస్కంతో వ్యవసాయానికి ఉరితాడు..
రైతు డిస్కంతో వ్యవసాయానికి సీఎం రేవంత్ ఉరితాడు బిగిస్తున్నాడని పడ్డారు. 24 గంటల కరెంట్ ఇస్తేనే ఓట్లు అడుగుతానని సీఎం ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. పగలు మాత్రమే ఉండే సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు కరెంట్ కష్టాలు తప్పవని.. సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. డిస్కంల అప్పులపై ముఖ్యమంత్రివి పచ్చి అబద్ధాలు అని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే ఏటా పదివేల కోట్ల బాకీలు పెట్టారని ఆరోపించారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే మూడో డిస్కం ఏర్పాటు చేస్తున్నారని.. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్‌తో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ
బీఆర్ఎస్ (BRS) పదేళ్ల పాలనలో డిస్కంలకు రూ. 27,000 కోట్లను ప్రభుత్వం బకాయి పడిందన్నారు. అంటే ఏడాదికి సగటున సుమారు రూ. 2,000 కోట్లు మాత్రమేనని చెప్పారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండున్నరేళ్లలోనే డిస్కంలకు రేవంత్ సర్కార్ ఏకంగా రూ. 25,284 కోట్లు బకాయి పడిందన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి సగటున రూ. 10,113 కోట్ల చొప్పున డిస్కంలను అప్పులపాలు చేసిందని చెప్పారు. ఇది బీఆర్ఎస్ తో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ అని చెప్పారు. ఆర్పీడీసీఎల్ ఏర్పాటును వెంటనే రద్దు చేసి, రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు.

