కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మొక్క జొన్న రైతులు (Maize Farmers) తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో రైతులు మొక్క జొన్న పంట పండించినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులు మార్కెట్‌కి మక్కలు తరలించారన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.
మొక్క జొన్న మద్దతు ధర రూ.2,400 ఉంటే, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులు రూ.1600లకే అమ్ముకొని నష్టపోతున్నారని హరీశ్ రావు చెప్పారు. మరోవైపు అకాల వర్షాలతో మార్కెట్‌లో, కల్లాల్లో మొక్కజొన్న తడిసి రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం మొక్క జొన్న రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. పంట మార్పిడి చేయాలని ప్రభుత్వమే రైతులకు చెప్పిందని హరీశ్ రావు గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరావు వరి వేయొద్దని, వరి వేస్తే కొనమని చెప్పారన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న పండిస్తే కొనకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఎందుకు ఇంకా కొనుగోళ్లు ప్రారంభించడం లేదని హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. పంటంతా దళారుల పాలయ్యాక దళారుల వద్ద మొక్క జొన్న కొంటారా అని నిలదీశారు.
Read Also: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్!
Follow Us On: Sharechat

