కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానిది మిషన్ మోడ్ కాదని.. కమీషన్ మోడ్ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే.. తానే స్వయంగా వేలాది మంది రైతులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తానని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలోని ఎన్సాన్‌పల్లి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించి మాట్లాడారు. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో రైతుల కష్టాల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికి 60 సార్లు ఢిల్లీకి ట్రిప్పులు కొట్టాడని.. రేవంత్ ఢిల్లీ ట్రిప్పులతో తమకు వచ్చిందేమీ లేదన్నారు. ముందు ఢిల్లీ ట్రిప్పులు బంద్ చేసి, కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులు పెంచాలని డిమాండ్ చేశారు.
వరి ధాన్యం క్వింటాల్‌కు 5 కిలోల తరుగుతో రైతులు నిలువునా మోసపోతున్నా మంత్రులకు, అధికారులకు పట్టింపు లేదని హరీశ్ రావు దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్రం కొనకున్నా, రైతులకు నష్టం కలగకుండా కేసీఆరే కొనుగోలు చేశారని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు చేతనైతే ఢిల్లీ పోయి కొట్లాడాలి కానీ రైతులను నట్టేట ముంచవద్దని హెచ్చరించారు. ఒక్క మంత్రి కూడా కొనుగోలు కేంద్రాలకు రావడం లేదని మండిపడ్డారు.
రోహిణీ కార్తె వచ్చినా కొనుగోళ్లు (Paddy Procurement) కాక వడ్లు కల్లాల్లోనే ముగ్గుతున్నాయని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో పండిన పంటలో ఇప్పటివరకు మూడో వంతు మాత్రమే కొన్నారని.. ఇంకా రెండు వంతుల వడ్లు ఆరుబయటే ఉన్నాయన్నారు. వర్షాలకు మురుస్తూ వడ్ల కుప్పల మీదనే మెదక్ జిల్లా కొల్చారంలో ఒక రైతు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 10-12 మంది రైతులు కల్లాల్లో ప్రాణాలు విడిచారని చెప్పారు. సీఎం రేవంత్ హైదరాబాద్‌లో కూర్చుని మిషన్ మోడ్ అని పేపర్ టైగర్ లా డైలాగులు కొడుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయని ఎద్దేవా చేశారు.

