కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రైతులు 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తుంటే శనగలు, సన్ ఫ్లవర్ కొనే నాథుడే లేడని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీ మంత్రులు నిద్రపోతున్నారా? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుని “నేనే రాజు.. నేనే మంత్రి” అనుకుంటున్నాడని.. తమ అరాచకాలను గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇస్తావా? ఇవ్వవా? అంటూ ఫైర్ అయ్యారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చోబెట్టారని.. ప్రతిరోజూ బీఆర్ఎస్ నేతల ఫోన్లను, తమ ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను చట్టవ్యతిరేకంగా హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగే అవినీతి, అక్రమాల వ్యవహారాలన్నీ రికార్డు అవుతున్నాయని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదన్నట్టు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో రూ.100 కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నాడని ఆరోపించారు. తమ పాలనలో సగం కాలం పూర్తయిందని.. మిగిలిన సగం కాలమైనా ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేయాలన్నారు. ఎకరాకు కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే కొంటామని మక్కలకు కొత్త షరతులు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. 13 లక్షల ఎకరాల్లో పంట వస్తే కనీసం సగం కూడా కొనలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు (Paddy Procurement) ఇంకా ప్రారంభం కాలేదని.. వడ్లకు ఐదారు కిలోల తరుగు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. తరుగు పెడితే తోలు తీస్తానన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడెవరి తోలు తీస్తాడో చెప్పాలని హరీశ్ రావు (Harish Rao) ఫైర్ అయ్యారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
Follow Us On : WhatsApp

