కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తీవ్రంగా విమర్శించారు. సోమవారం జరిగిన బీఏసీ (BAC) సమావేశం తర్వాత ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని తాము డిమాండ్ చేశామని ఆయన స్పష్టం చేశారు.
నీటి పారుదల రంగంపై ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, తాము కూడా ప్రతిపక్షంగా పీపీటీ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని హరీష్ రావు కోరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, వాస్తవాలను సభ ముందు ఉంచే హక్కు తమకు ఉందని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వం చెప్పే అంశాలనే కాకుండా, ప్రతిపక్షాల వాదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
శాసనసభలో అత్యంత కీలకమైన హౌస్ కమిటీలు, లెజిస్లేచర్ కమిటీలను ఇంతవరకు నియమించకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కమిటీలు లేకపోవడం వల్ల పర్యవేక్షణ లోపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సంప్రదాయాలను ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. ఉదయం పదిన్నర గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుంటే, దానికి సంబంధించిన ఎజెండాను తెల్లవారుజామున మూడు గంటలకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఇంత స్వల్ప వ్యవధిలో ఎమ్మెల్యేలు అంశాలను ఎలా అధ్యయనం చేస్తారని ఆయన నిలదీశారు. ఇదేం సంప్రదాయం అని హరీష్ రావు ప్రశ్నించారు.
Read Also: ‘ఇన్ని రోజులు నా జీవితాన్ని వృథా చేసుకున్నాను‘
Follow Us On: Pinterest


