Mobile Popup Ad
Mobile Popup Ad

హైడ్రాతో రియల్ ఎస్టేట్ ఖేల్ ఖతం: హరీష్ రావు

కలం, మెదక్ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, హైడ్రా చర్యల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేక ఎంతో మంది ముఖాల్లో ఆనందం ఆవిరైపోయిందన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన “తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనం”లో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో భూముల విలువ గణనీయంగా పెరిగిందని హరీష్ రావు గుర్తుచేశారు. ఆ నాడు తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి ఉన్న క్రేజ్ చూసి, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసేవారని ఆయన పేర్కొన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి రూపంలో రాష్ట్రానికి గ్రహణం దాపురించిందని విమర్శించారు.

అయితే ఈ గ్రహణం శాశ్వతం కాదని, ఇంకో రెండేళ్లలో గ్రహణం పూర్తిగా పోతుందని జోస్యం చెప్పారు. మీ తలరాతలు మారాలి అంటే.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వాతలు పెట్టక తప్పదని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సూచించారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని ఈ సమ్మేళనంలో హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అసోసియేషన్ ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>