కలం వెబ్ డెస్క్: ఆర్టీసీ సమ్మెలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. శంకర్ గౌడ్ ఆత్మబలిదానం తీవ్రంగా కలిచివేసిందన్నారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్‌కు నివాళి అర్పించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే శంకర్ గౌడ్ ప్రాణాలు విడిచారన్నారు. శంకర్ మృతికి సీఎం రేవంత్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
కార్మికులు హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి కానీ, ఇలాంటి ఆత్మబలిదానాలకు ఎవరూ పాల్పడొద్దని హరీశ్ కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని, ఇతర అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిందని, ఇప్పుడు మాట తప్పడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని విమర్వించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.ఆర్టీసీ కార్మికుల న్యాయమైన ఆవేదనను పరిగణలోకి తీసుకొని, ప్రభుత్వం తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించి, కార్మికుల్లో విశ్వాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక శంకర్ గౌడ్ అమరుడైన రోజును అప్పాయింటెడ్ డేగా ప్రకటించి, ఆయన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అధైర్యానికి లోనుకావద్దని, కలిసికట్టుగా, న్యాయబద్ధంగా పోరాడి హక్కులను సాధించుకుందామని హరీశ్ రావు సూచించారు.

