కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావు (Harish Rao) సంచలన ప్రకటన చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం తాను త్వరలోనే భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా ప్రజల, ముఖ్యంగా రైతాంగ ప్రయోజనాలే పరమాధిగా బసవేశ్వర (Basaveshwara) నుండి సంగమేశ్వర (Sangameshwara) వరకు ఈ భారీ పాదయాత్ర కొనసాగుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిలిపివేసిందని ఆయన ఫైర్ అయ్యారు. ప్రాంతీయ అభివృద్ధిని అడ్డుకుంటూ, ప్రాజెక్టులను అటకెక్కించిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ఆ ‘బసవేశ్వర, సంగమేశ్వర’ దేవుళ్లతో పాటు జిల్లా ప్రజలు కూడా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదని, అన్ని రంగాల్లోనూ ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని హరీశ్ రావు (Harish Rao) విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల ముందు ఎండగట్టేందుకే తాను నేరుగా జనం మధ్యకు వస్తున్నట్లు తెలిపారు. హరీశ్ రావు ప్రకటించిన పాదయాత్ర ప్రకటనతో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీమంత్రి కేటీఆర్ సైతం పాదయాత్ర చేస్తానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ఎజెండాగా బావబామ్మర్థులు ఇద్దరూ భారీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Read Also : గజ్వేల్ కాంగ్రెస్‌లో ‘రెబెల్’ మంటలు..పీసీసీ చీఫ్ వర్సెస్ తూంకుంట
Follow Us On: Instagram

