కలం, వెబ్ డెస్క్: సింగరేణి సంస్థ కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని.. కార్మికులే సింగరేణి సంస్థను కాపాడుకోవాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సూచించారు. గోదావరిఖనిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో’ నినాదంతో జరిగిన సింగరేణి (Singareni Collieries) పరిరక్షణ సదస్సులో ఆయన పాల్గొన్నారు. సింగరేణిలో కుంభకోణాలు, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికుల పాత్ర గొప్పదని కొనియాడారు. చంద్రబాబు నాయుడు గోల్డెన్ షేక్ హ్యాండ్‌తో కార్మికులను తొలగించాడని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 19 వేల మందికి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ మాట నిలుపుకున్నాడని గుర్తు చేశారు. సింగరేణి స్థలాల్లో ఇండ్లకు హక్కులు కల్పించామన్నారు.
మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి అని.. మళ్ళీ ఉద్యోగాలు తీసేస్తా అని అంటున్నారని హరీశ్ ఫైర్ అయ్యారు. మెడికల్ బోర్డు పెట్టకుండా కార్మిక కుటుంబాలను గోసపెడుతున్నారని.. బైపాస్ సర్జరీలు అయిన వాళ్ళను ఫిట్ అంటూ ఉద్యోగం చేయాలని వేధిస్తున్నారని మండిపడ్డారు.సింగరేణిలో గెలిచిన గుర్తింపు సంఘాలు.. కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని చెప్పారు. 16% ఉన్న లాభాల వాటా 33శాతానికి పెంచింది కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల బాటలోకి వెళ్తుందన్నారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలని అంటున్నారని తెలిపారు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌లు కూడా రావని జోస్యం చెప్పారు.
సింగరేణిలో అనేక స్కాములు..
సింగరేణి సైట్ విజిటింగ్ స్కాం, సోలార్ పవర్ స్కాంతో పాటు అనేక స్కాంలకు రేవంత్ సర్కార్ పాల్పడిందని ఆరోపించారు. సింగరేణి చరిత్రలో ఎన్నడు లేని సైట్ విజిటింగ్ రూల్ ని కాంగ్రెస్ పెట్టిందన్నారు. రేవంత్ బావమరిది కోసమే సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ విధానం తెచ్చారని ఆరోపించారు. ఓబీ టెండర్లలో మైనస్ కోట్ చేసేది, సైట్ విజిటింగ్‌తో ప్లస్ టెండర్ కోట్ చేస్తున్నారని అన్నారు.సైట్ విజిటింగ్‌తో మొదటి టెండర్ సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి దక్కిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పోరాటంతో నైనీ బ్లాక్ రద్దు చేశారని.. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది టెండర్ ఎందుకు రద్దు చేయలేదు? అని ప్రశ్నించారు. శ్రీరాంపూర్ ప్రకాశం ఖని టెండర్లు ఏడుసార్లు రద్దు చేశారని.. అవసరంలేని సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేశారన్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల డబ్బులు కమీషన్లకు ఖర్చు చేశారని మండిపడ్డారు. జిలెటిన్ స్టిక్స్‌లో కూడా కుంభకోనానీకి పాల్పడ్డారని.. వాళ్లకు అనుకూలంగా లేని అధికారులపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని తప్పుడు లెక్కలు చెప్తున్నారని మండిపడ్డారు.
పీపీటీ ఇస్తే పవర్ కట్ చేశారు..
కాంగ్రెస్ పాలనలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడం లేదని.. ఈ ఏడాది 75% మాత్రమే ఉత్పత్తి జరిగిందన్నారు. బొగ్గు నిల్వలు పరిశీలించడానికి వెళితే వందల పోలీసులతో అడ్డుకోవడం ఎందుకు? అని ప్రశ్నించారు. హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జనం చూడవద్దని గోదావరిఖనిలో కరెంట్ కట్ చేశారని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు రూ .7 వేల కోట్లు మాత్రమేనని.. కాంగ్రెస్ వచ్చిన రెండేండ్లలో రాష్ట్ర బకాయి రూ. 19 వేల 330 కోట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి అప్పుల్లో కూరుకుపోవడానికి కారణమే రేవంత్ రెడ్డి అని విమర్శించారు.

