చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ ఇస్తున్నాడు.. హరీశ్ రావు ఫైర్

కలం మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబుకు “గురుదక్షిణ”గా ఇస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్ర జల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హరీశ్ రావు మాట్లాడారు.

ఈ రోజు గోదావరి-నల్లమల కేసు హియరింగ్‌కు రాగా, ఈ పిటిషన్ లోపభూయిష్టంగా ఉందని, కనీసం విచారణకు కూడా నిలవదని సుప్రీంకోర్టు పేర్కొనడం, రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. గోదావరి-నల్లమల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇప్పటికే రిట్ డిస్మిస్ కాగా, ఇప్పుడు పిటిషన్ కూడా ఫెయిల్ అయిందని, విచారణ తీరుపై హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వ, ముఖ్యమంత్రి నిర్లక్ష్యం బట్టబయలైందని విమర్శించారు.

కనీస జ్ఞానం ప్రభుత్వానికి లేదు..

ఇంత ముఖ్యమైన కేసు విచారణకు వస్తున్నప్పుడు కనీసం రెండు రోజుల ముందైనా సీఎం, ఇరిగేషన్ మంత్రి, న్యాయశాఖ మంత్రి, సీనియర్ అధికారులు కలిసి రివ్యూ చేసుకోవాలన్న కనీస జ్ఞానం ప్రభుత్వానికి లేదన్నారు. సీఎం, మంత్రులు నిరంతరం బీఆర్ఎస్ నాయకులను తిట్టడానికే సమయం కేటాయిస్తూ టైంపాస్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం పక్కన పెడితే, కనీసం వాటికి వ్యతిరేకంగా కోర్టులో సరైన కేసు కూడా ఫైల్ చేయలేని స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. తెలంగాణ జల ద్రోహి కూడా. చంద్రబాబు ఏజెంట్ అయిన ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి కమిటీ వేయడం దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లుంది. ఆదిత్యనాథ్ మాటలు నమ్మి ముందుకు పోతే తెలంగాణ ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటయన్నారు.

ప్రజలకు బహిరంగంగా చెప్పాలి..

ఇటీవల ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో ఏం మాట్లాడారో, ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారో ప్రజలకు బహిరంగంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏపీ, కర్ణాటకకు ‘సుజలాం, సుఫలాం’లా.. తెలంగాణకు మాత్రం ‘శూన్యం’లా మిగిలేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువని ఎద్దేవా చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సమర్థవంతంగా అడ్డుకున్నామని హరీష్ రావు (Harish Rao) గుర్తు చేశారు. బనకచర్ల వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని బీఆర్ఎస్ మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తోందని తెలిపారు.

Read Also: ఆయనకు సారీ చెప్పిన కేటీఆర్.. కారణమిదే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>