కలం, హనుమకొండ : హనుమకొండ (Hanumakonda) లో ఉచిత బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. నూతనంగా ప్రారంభమైన సురభి ఫుడ్ కోర్టు 300 ఉచిత బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేస్తామని ప్రచారం చేయడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అయితే జనసందోహానికి తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో తోపులాట చోటుచేసుకుని పలువురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు.
హనుమకొండ కేయూ క్రాస్ రోడ్ వద్ద ఉన్న చిన్న సందులో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ చేపట్టారు. అయితే భారీగా ప్రజలు ఒక్కసారిగా ఎగబడటంతో పరిస్థితి అదుపు తప్పి తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకరినొకరు తోసుకోవడంతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వ్యాపార ప్రచారం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నిర్వాహకులు, అదే స్థాయిలో భద్రతా చర్యలు, క్యూ లైన్లు, బారికేడ్లు, సిబ్బంది వంటి కనీస ఏర్పాట్లు చేయలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
ప్రచారంపై చూపిన శ్రద్ధ ప్రజల భద్రతపై చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఏదైనా విషాదం జరిగి ఉంటే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఉచిత పంపిణీ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో జనసందోహాన్ని నిమంత్రించేలా నిర్వాహకులు, సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

