కలం, వరంగల్ బ్యూరో : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, మోడల్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని హనుమకొండ (Hanumakonda) జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి (Chahat Bajpai) తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో మెరిట్ మార్కులు సాధించిన కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ చదువు ప్రస్థానం, సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలను వివరించారు.
కలెక్టర్ (Chahat Bajpai) మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, తల్లిదండ్రులు, అధ్యాపకుల సమిష్టి కృషి వల్లే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించగలిగారని పేర్కొన్నారు. రాబోయే జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సమగ్రంగా సిద్ధమై, అక్కడ కూడా ఉత్తమ ర్యాంకులు సాధించాలని సూచించారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టాలని, యూపీఎస్సీ, గ్రూప్స్ వంటి ఉన్నత లక్ష్యాలను సాధించాలని హితవు పలికారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ విద్యార్థులు ప్రైవేట్ విద్యార్థులకు దీటుగా ప్రతిభ చాటడం గర్వకారణమని తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు 990కి పైగా మార్కులు సాధించడం విశేషమని అన్నారు. స్పష్టమైన లక్ష్యంతో కృషి చేస్తే ప్రతి విద్యార్థి విజయాన్ని సాధించగలడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన 36 మంది మెరిట్ విద్యార్థులను కలెక్టర్, అదనపు కలెక్టర్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. సంబంధిత కళాశాలల అధ్యాపకులను కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, జీసీడీవో సునీత, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

