epaper
Wednesday, February 18, 2026
epaper

ఆ మాజీ నేత భూ అరాచకం.. 28 ఎకరాలు స్వాహా, బాధితులు లబోదిబో!

​కలం, వరంగల్ బ్యూరో: రాజకీయ నాయకుల అండదండలుంటే చాలు.. ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేయొచ్చు. అధికారం ఉంటే భూ రికార్డులను మార్చేయొచ్చు. పేదలు, అమాయకులను బెదిరించి వారి భూములనూ కొల్లగొట్టేయొచ్చు. అచ్చం ఇలాగే ఉంది హనుమకొండ (Hanamkonda) జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ తీరు. ఆయన అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఏకంగా 28.04 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని బాధితులను నడిరోడ్డుపై నిలబెట్టిన వైనం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. ఆయన చర్యలతో విసిగిపోయిన బాధితులు చివరకు కలెక్టర్ స్నేహ శబరీష్‌ ను కలిసి మొరపెట్టుకున్నారు.

సొంతవారి భూములకే ఎసరు

​రక్తసంబంధం కంటే ఆస్తి మిన్న అన్నట్లుగా కన్న కూతురు చనిపోతే, ఆమె కొడుకు (మనువడు) బొద్దుల పృథ్వీరాజ్‌కు అండగా ఉండాల్సిన అతడు మోసానికి పాల్పడ్డాడు. పృథ్వీరాజ్ అమెరికాలో ఉండటాన్ని ఆసరాగా తీసుకుని ఫోర్జరీ పత్రాలతో సర్వే నంబర్ 91/1, 91/బి/1 లోని 4.16 ఎకరాల భూమిని తన పేర మీదుగా పట్టా చేయించుకున్నాడు. ఆయన కబ్జా వైనాన్ని బాధితుడు కలెక్టర్‌తో మొరపెట్టుకున్నాడు.

ఆ సంఘం భూమిపై కన్ను

​నందనం గ్రామంలోని గౌడ సంఘం సభ్యులు కొనుగోలు చేసిన భూములపై కూడా ఈ నేత కన్నుపడింది. 254 మంది సభ్యుల ప్రయోజనాలను కాలరాస్తూ.. సర్వే నంబర్లు 93, 101 లోని 7.28 ఎకరాల భూమి (Land)ని అక్రమంగా పట్టా చేయించుకున్నాడు. ఆ భూమిని తిరిగి ఇచ్చేస్తానని నమ్మించి మోసం చేశాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అలాగే దొనికని రవీందర్ కు చెందిన 4.10 ఎకరాలు (సర్వే నంబర్లు 88, 89, 93), దొనికని శ్రీదేవికి చెందిన ఒక ఎకరం (సర్వే నంబర్ 89), దొనికని రేణుకకు చెందిన 1.31 ఎకరాల (సర్వే నంబర్ 93, 101) భూమిని కూడా మాయం చేశాడు. ఈద ప్రసాద్‌కు చెందిన 4.23 ఎకరాల (సర్వే నంబర్ 874/ఏబీసీడీ) భూమిని కూడా కబ్జా చేశాడు. చివరకు సాక్షాత్తు ప్రభుత్వానికి చెందిన 8 ఎకరాల ఆకేరు నది పరివాహక ప్రాంతాన్ని కూడా వదలకపోవడం గమనార్హం.

అధికారుల మౌనం

ప్రభుత్వ ​భూములు (Govt Lands) ఎలా మాయమయ్యాయని అడిగితే ఐనవోలు తహసీల్దార్ కార్యాలయంలో సమాధానమే లేదు. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే భూముల వివరాలు రికార్డులో లేవని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఎకరాల కొద్దీ భూమి అక్రమంగా చేతులు మారుతుంటే రెవెన్యూ యంత్రాంగం నిద్రపోతోందా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల అండదండలు లేకుండా రికార్డుల తారుమారు అసాధ్యమని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్ న్యాయం చేయాలని బాధితులు మొర పెట్టుకున్నారు. లేకుంటే కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపడతామని, తమ భూములు దక్కే వరకు పోరాటం ఆపేది లేదని బాధితులు తేల్చి చెప్పారు.

Read Also: కమిషన్లు, సీబీఐ, ఈడీ… అయినా సస్పెన్స్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>