Mobile Popup Ad
Mobile Popup Ad

పీవీ విజ్ఞాన కేంద్రం పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి (Collector Chahat Bajpai) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం మాజీ ప్రధానమంత్రి దివంగత పాములపర్తి వెంకట నరసింహారావు స్వగ్రామమైన వంగరలో నిర్మాణంలో ఉన్న పీవీ విజ్ఞాన కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా పీవీ స్ఫూర్తి వనంలోని ఫోటో గ్యాలరీ, సైన్స్ మ్యూజియం, సమావేశ మందిరాన్ని సందర్శించిన కలెక్టర్, అసంపూర్తిగా ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని పర్యాటక శాఖ, కుడా అధికారులకు సూచించారు. తాగునీటి పైపులైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 28 నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

అనంతరం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగృహంలో ఏర్పాటు చేస్తున్న ఫోటో మ్యూజియాన్ని కలెక్టర్ సందర్శించారు. పీవీ నరసింహారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో దిగిన అరుదైన ఫోటోలను కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. వివిధ సందర్భాల్లో దిగిన ఫోటోల ప్రాముఖ్యతను పీవీ కుటుంబ సభ్యులు పీవీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, పీవీ మదన్ మోహన్ జిల్లా కలెక్టర్‌కు వివరించారు.

అదేవిధంగా వివిధ దేశాల నుంచి పీవీ నరసింహారావుకు లభించిన పురస్కారాలు, ఆయన రచించిన పుస్తకాలను కలెక్టర్ పరిశీలించారు. ముందుగా పీవీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ రాజేష్, పర్యాటక శాఖ డీఈ ధనరాజ్, ఏఈ కీర్తి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>