కలం, వరంగల్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కమిషనర్ టి. వెంకన్న (Commissioner Venkanna) అధికారులను ఆదేశించారు. శుక్రవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్), టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కమిషనర్ వర్షాకాలంలో చేపట్టాల్సిన ముందస్తు రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో శిథిలావస్థకు చేరిన భవనాలు, ప్రమాదకర నిర్మాణాలను ప్రత్యేకంగా గుర్తించి వెంటనే యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు ముప్పుగా ఉన్న భవనాల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వాటిని ఖాళీ చేయించడం లేదా తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు. భవనాల సెల్లార్‌లలో విద్యుత్ మీటర్లు, విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం అత్యంత ప్రమాదకరమన్నారు. అలాంటి నిర్మాణాలను వెంటనే గుర్తించి సరి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో సెల్లార్‌లలో నీరు నిల్వ ఉండడం వల్ల విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
నగరంలోని కమర్షియల్ సముదాయాలు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, అపార్ట్‌మెంట్లు తదితర భవనాల్లో అగ్నిమాపక భద్రతా పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని సంస్థలకు నోటీసులు జారీ చేసి అవగాహన కల్పించాలని డీఆర్‌ఎఫ్ అధికారులకు ఆదేశించారు. డీఆర్‌ఎఫ్ అధికారులు ప్రతి నెల క్రమం తప్పకుండా పీరియాడికల్ తనిఖీలు నిర్వహిస్తూ ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, భవన భద్రత, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, అగ్నిమాపక పరికరాల పనితీరును పరిశీలించాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
భారీ వర్షాల సమయంలో డీఆర్‌ఎఫ్ సిబ్బందికి అవసరమైన రెస్క్యూ పరికరాలు, భద్రతా సామగ్రి, ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. నీట మునిగే ప్రాంతాలు, నాలాలు, లోతట్టు ప్రాంతాలు, ప్రమాదకర చెట్లు, బలహీన నిర్మాణాలపై ప్రత్యేక నిఘా ఉంచి ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే నగరంలో జరుగుతున్న భవన నిర్మాణాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలు, అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయా లేదా అనే అంశాలను టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, సూపరింటెండింగ్ ఇంజినీర్ రాజ్‌కుమార్, ఇన్‌చార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డీఎఫ్‌వో శంకర్ లింగం, ఎస్‌ఎఫ్‌వో రాజేశ్వర్ రావు, సీనియర్ అసిస్టెంట్ విజయ్‌కుమార్, డీఆర్‌ఎఫ్ అధికారులు, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

