Mobile Popup Ad
Mobile Popup Ad

హ‌రీశ్ రావు గురించి మాట్లాడితే ఊరుకోం: జీవీ రామకృష్ణారావు

కలం, కరీంనగర్ బ్యూరో: మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణరావు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ (BRS) కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు (GV Ramakrishna Rao) తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై గానీ, హరీశ్ రావుపై గానీ మాట్లాడే ముందు విజయరమణరావు ఆ ప్రాజెక్టు విశిష్టత తెలుసుకోవాలన్నారు. కనీస అవగాహన లేకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ​”విజయరమణరావు… కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మీ ఇంటి దగ్గర ఒక బావి తవ్వడం కాదు! ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటి,” అని రామకృష్ణారావు ఎద్దేవా చేశారు.

​కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం అని రామకృష్ణారావు పేర్కొన్నారు. ​ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిమాణాన్ని ఆయన వివరించారు. ​1,531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 20 పంప్ హౌస్‌లు, 20 రిజర్వాయర్లు, 1,832 కిలోమీటర్ల సరఫరా వ్యవస్థ, 240 టీఎంసీల నీటి సామర్థ్యం, 204 కిలోమీటర్ల భూగర్భ సొరంగాలు ఉన్నాయన్నారు. ​ఈ ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు (ఎల్‌ఎండీ), అప్పర్ మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, సింగూర్, నిజాంసాగర్ నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరకు అద్భుతమైన అనుసంధానం కల్పించబడిందని గుర్తు చేశారు.

​రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ డ్రామాలు

​కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాళేశ్వరంపై ఉద్దేశపూర్వకంగా చెడ్డపేరు తీసుకురావాలని చూస్తోందని రామకృష్ణారావు ఆరోపించారు. ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని మాట్లాడే ముందు.. కాంగ్రెస్ ప్రభుత్వమే నియమించిన ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఉత్తర్వులను విజయరమణరావు పూర్తిగా చదవాలని సూచించారు. ఆధారాలు లేని ఆరోపణలు పక్కన పెట్టి, రైతుల ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు మేడిగడ్డ బ్యారేజీని మీ ప్రభుత్వం ఎందుకు మరమ్మతు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ​తెలంగాణ రైతుల సంక్షేమం కోసం మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా వంటి చారిత్రాత్మక సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ నాయకత్వానిదేనని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఇలాంటి ఒక్క గొప్ప పథకాన్నైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు.

జ్ఞానం లేకుండా మాట్లాడొద్దు

​గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసి మళ్లీ గోదావరిలోకే వదిలే ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదనడం విజయరమణరావు అజ్ఞానానికి నిదర్శనమని, ఆయనే ఒక “తుగ్లక్” లా మాట్లాడుతున్నారని విమర్శించారు. మహారాష్ట్రలోని మహిసాల్, కృష్ణా-మరాఠ్వాడా ప్రాజెక్టులతో పాటు అమెరికాలోని బిగ్ థాంప్సన్, సెంట్రల్ అరిజోనా ప్రాజెక్ట్ వంటి ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్టులు ఇందుకు ఉదాహరణలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా గ్రావిటీ, లిఫ్ట్ ఇరిగేషన్, టీఎంసీలపై పూర్తి అవగాహనతో బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు.

​బీఆర్ఎస్‌కు కేటీఆర్, హరీశ్ రావు రెండు కళ్లు

​కేటీఆర్, హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీకి రెండు కళ్లలాంటి నాయకులని కొనియాడారు. “మహాభారతంలోని శ్రీకృష్ణుడు–అర్జునుడిలా వారు పార్టీని, క్యాడర్‌ను బలోపేతం చేస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ దృష్టిని ఆకర్షించడానికి వారు నటించాల్సిన అవసరం లేదు, తమ రాజకీయ ప్రస్థానంతో సొంతంగా ప్రజా మద్దతు సంపాదించుకున్నారు” అని స్పష్టం చేశారు. ​మంత్రులు పొన్నం ప్రభాకర్, వడ్లూరి లక్ష్మణ్ కుమార్, జూపల్లి కృష్ణారావు బహిరంగ చర్చకు సవాల్ విసిరి, తీరా కేటీఆర్, హరీశ్ రావు సిద్ధమయ్యేసరికి పోలీసులతో అరెస్టు చేయించడం కాంగ్రెస్ అసమర్థతకు అద్దం పడుతోందన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ఢిల్లీ అధిష్టానం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మీ సీఎంకు ఏర్పడిందని, ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులపై వ్యాఖ్యలు చేయడం కేవలం రాజకీయ నాటకమేనని విమర్శించారు. ​కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల జీవనాడి అని, దానిని రాజకీయాలకు బలిచేయకుండా వెంటనే పునరుద్ధరించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ తరఫున రామకృష్ణారావు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>