కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర పౌరులందరూ రాజ్యాంగ హక్కులను సద్వినియోగం చేసుకోవాలనిశాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) పిలుపునిచ్చారు. 77వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్లో శాసన మండలి, శాసనసభ ఉద్యోగులతో ఆయన రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మండలి కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి ఆర్. తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే గొప్ప రాజ్యాంగం మన భారతదేశానికి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ 77వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ నాయకత్వంలో ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామని పేర్కొన్నారు. ఒక్క రక్తపు చుక్క కూడా చిందించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలను మార్చగలిగే గొప్ప శక్తిని భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిందని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగ విలువలకు అనుగుణంగా జీవించాలన్నారు.

