Mobile Popup Ad
Mobile Popup Ad

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: గుత్తా సుఖేందర్ రెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో: జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో ముచ్చటించిన ఆయన.. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్, జమిలీ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త విధానం ప్రకారం ఉన్న సీట్లను 50 శాతం పెంచేలా చర్యలు ఉన్నాయని అన్నారు. అయితే, కేవలం జనాభానే ప్రామాణికంగా తీసుకోకుండా, 50 శాతం జనాభా, 50 శాతం జీఎస్టీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. జమిలీ ఎన్నికలు ఒకవేళ అమలైతే దేశంలోని 18 రాష్ట్రాలు ఒక విడతలో, మిగిలిన రాష్ట్రాలు మరో విడతలో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. రాజకీయాల్లో పెరిగిపోతున్న డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేయకపోతే, భవిష్యత్తులో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి ఉండదని గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ పేరు మార్పు ప్రచారంపై స్పందిస్తూ.. అసలు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ (BRS)గా ఎందుకు మార్చారో ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. అధికార పార్టీలో అసంతృప్తి ఉండటం సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు.

ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారం..

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమస్య ప్రస్తుతం పరిష్కారమైందని, ముఖ్యంగా సన్న ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణపై ప్రభుత్వం పూర్తి స్థాయి నియంత్రణ కలిగి ఉండాలని, కేంద్రం 80 శాతం రా రైస్ అడుగుతుంటే.. మిల్లర్లు మాత్రం బాయిల్డ్ రైస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వేసవి కాలంలో రా రైస్ సేకరిస్తే నూక శాతం ఎక్కువగా వస్తుందని, ఇది మిల్లర్లకు నష్టమని పేర్కొన్నారు. మిల్లులను మూసివేయించడం సమస్యకు పరిష్కారం కాదని, అవి బంద్ అయితే ధాన్యం కొనుగోలు చేసేవారు ఉండరని హెచ్చరించారు. నల్గొండ జిల్లాకు కీలకమైన ఏఎమ్మార్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు) ద్వారా ప్రస్తుతం కేవలం 2,400 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తోందని, కానీ అది 4,000 క్యూసెక్కులకు పెరగాల్సిన అవసరం ఉందని గుత్తా అభిప్రాయపడ్డారు. సాగునీటి కాలువలను విస్తరించడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, లైనింగ్ పనులు చేపట్టకముందే కాలువల విస్తరణ పనులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది ఇతర రాష్ట్రాల కూలీలు ఉపాధి పొందుతున్నారని, ఇది రాష్ట్ర ఆర్థిక బలానికి నిదర్శనమని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>