సర్కారు బడులపై గుత్తా సుఖేందర్ కీలక వ్యాఖ్యలు

కలం, నల్లగొండ: అభివృద్ధికి పునాది విద్య అని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy)  అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నల్లగొండ టీటీడీసీలో నియోజకవర్గ స్థాయి సర్పంచులు, కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులకు విద్యపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విద్యతోనే అభివృద్ధి

ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 8 శాతం విద్య కోసం కేటాయిస్తున్నదని తెలిపారు. ప్రతి సర్పంచ్, కార్పొరేటర్ నెలకు కనీసం ఒకసారి ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యా బోధన, మౌలిక వసతులపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. రాష్ట్రంలో 23 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, 12 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 39 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు.

ప్రభుత్వ టీచర్లు గ్రామాల్లోనే ఉండాలి

ప్రభుత్వ పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడికి 30 మంది విద్యార్థులు ఉండాల్సి ఉన్నా ప్రస్తుతం 15 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. గతంలో టీచర్లు గ్రామాల్లోనే ఉండి విద్యార్థులతో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం విద్య కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, విద్యా కిట్‌లు, యూనిఫామ్‌లు, స్కాలర్‌షిప్‌లు అందజేస్తోందని తెలిపారు. ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయల వ్యయంతో 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, నల్లగొండ మేయర్ గురు చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, స్థానిక కార్పొరేటర్ పున్నా జ్ఞానేశ్వరి,సర్పంచులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>