కలం, వెబ్ డెస్క్ : ఆర్సీబీతో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన అనంతరం గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెను ప్రమాదం తప్పింది. మ్యాచ్ అనంతరం స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టు బస్సులో ఆకస్మాత్తుగా మంటలు ( Gujarat Titans Bus Fire) చెలరేగాయి. అయితే బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో సహా ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పినట్లైంది.
ఈ అగ్నిప్రమాదం కారణంగా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు దాదాపు గంటపాటు రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వారి కోసం ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేశారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఆర్సీబీ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయి ఐపీఎల్ 2026 ట్రోఫీని చేజార్చుకున్నారు.

