కలం, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్ (Smartphone) మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. అయితే కొద్దిరోజులు వాడగానే ఫోన్ స్లో అవ్వడం, హ్యాంగ్ అవ్వడం చాలామంది ఎదుర్కొనే పెద్ద సమస్య. దీనికి ప్రధాన కారణం మన ఫోన్‌లో ఉండే కొన్ని రకాల యాప్స్, వాటి బ్యాక్ రౌండ్ కార్యకలాపాలే అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ప్రత్యేకించి సోషల్ మీడియా యాప్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్, ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్, ఫోటో ఎడిటింగ్ టూల్స్, ఫైల్ షేరింగ్ యాప్స్ ఎక్కువగా ఉంటే ఫోన్ మెమరీ, ప్రాసెసర్‌పై అదనపు భారం పడుతుంది. ఈ యాప్స్‌లో చాలా వరకు బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం పనిచేస్తూ డేటా, బ్యాటరీ, ర్యామ్‌ను వినియోగిస్తుంటాయట.
అయితే యాప్స్‌ను డిలీట్ చేయకుండానే ఫోన్ వేగాన్ని పెంచుకునే కొన్ని మార్గాలు ఉన్నాయి. ముందుగా ఉపయోగించని యాప్స్‌కు బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని పరిమితం చేయాలి. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాటరీ ఆప్టిమైజేషన్ లేదా బ్యాక్‌గ్రౌండ్ యాప్ మేనేజ్‌మెంట్ ద్వారా ఈ మార్పులు చేయవచ్చు. అలాగే యాప్స్ నిల్వ చేసే క్యాష్ ఫైళ్లను క్రమం తప్పకుండా క్లియర్ చేయడం వల్ల స్టోరేజ్ ఖాళీ అవుతుందని సూచిస్తున్నారు. ఫోన్‌లో కనీసం 15 నుంచి 20 శాతం స్టోరేజ్ ఖాళీగా ఉంచడం పనితీరును మెరుగుపరుస్తుందట. అవసరం లేని విడ్జెట్లు, లైవ్ వాల్‌పేపర్లు, ఆటో-సింక్ ఫీచర్లను నిలిపివేయడం కూడా ఉపయోగకరమని సూచిస్తున్నారు.
ఫోన్‌లోని యాప్స్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయడం ద్వారా బగ్స్ తొలగి పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అదనంగా తరచుగా రీస్టార్ట్ చేయడం ద్వారా తాత్కాలిక మెమరీ ఖాళీ అవుతుంది. ఫోన్‌లో ఎక్కువ యాప్స్ ఉండటం కంటే వాటి బ్యాక్‌గ్రౌండ్ వినియోగమే పనితీరును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి సరైన సెట్టింగ్స్ మార్పులతో యాప్స్‌ను తొలగించకుండానే ఫోన్‌ను వేగంగా పనిచేసేలా చేసుకోవచ్చని సూచిస్తున్నారు టెక్నాలజీ నిపుణులు.

