కలం, వెబ్‌డెస్క్: గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో 30 ఏళ్ల క్రితం జరిగిన రూ.20 లంచం కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు (Supreme Court) నేడు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఓ క్లర్క్, ప్యూన్‌కు శిక్షను రద్దు చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. గుజరాత్‌లో 30 సంవత్సరాల కింద ఓ విద్యార్థికి ఇవ్వాల్సిన ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం క్లర్క్, ప్యూన్ ఇద్దరూ రూ.120 డిమాండ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఏసీబీ నిర్వహించిన ట్రాప్‌లో ప్యూన్ వద్ద రూ.20 స్వాధీనం చేసుకున్నారు. అయితే వచ్చిన ఆరోపణల ప్రకారం క్లర్క్ వద్ద రూ.100 లభించలేదు. దీంతో ఈ కేసు అప్పటి నుంచి వాయిదాలు పడుతూ, పెండింగ్‌లోనే ఉంది.
ఇక తాజాగా లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లేవని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఫిర్యాదుదారు వాంగ్మూలంలో కూడా చాలా భిన్నమైన వాదనలు ఉన్నాయని తెలిపింది. ఏసీబీ అధికారులు కేవలం రూ.20 నగదు స్వాధీనం చేసుకున్నారన్న కారణంతో లంచం డిమాండ్ చేశారని, లంచం స్వీకరించారని రుజువైందని చెప్పలేమని స్పష్టం చేసింది. ఈ కేసుపై గుజరాత్ హైకోర్ట్, ఇతర దిగువ న్యాయాస్థానాలు ఇచ్చిన తీర్పులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. క్లర్క్, ప్యూన్‌లను ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో వారి 30 ఏళ్ల న్యాయ పోరాటానికి తెర పడింది.

