కలం, మునుగోడు: నల్లగొండలో నవంబర్15 నుండి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (AIKS) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం (CPM) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలోఅఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభల జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను ఇంటింటి తిరిగి పంచుతూ, విరాళాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి 80 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వీర తెలంగాణ పోరాటానికి కేంద్రంగా నిలిచిన నల్లగొండలో జాతీయ మహాసభలు జరుగుతున్నాయని చెప్పారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని శ్రీశైలం ఆరోపించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, మహిళా రైతులు, వలస కార్మికులు రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వలన రైతులు, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధాన్యం నిల్వ సౌకర్యాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా వ్యవసాయ రంగంలో గుత్తాధిపత్యానికి అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు.
పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, వ్యవసాయానికి సబ్సిడీలు పెంచాలని, రైతులను రుణ విముక్తులు చేయాలని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు, పోరాటాలు కొనసాగిస్తామని శ్రీశైలం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, బోడంగిపర్తి ఉపసర్పంచ్ సరికొండ ముత్యాలు, స్వామి, జంగయ్య, రామలింగం, తదితరులు పాల్గొన్నారు.

