కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ పరిధిలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. 15వ డివిజన్ పరిధిలోని చింతకుంట ప్రగతి నగర్‌లో ఉన్న ప్రభుత్వ గుట్ట భూమి కబ్జాకు (Land Encroachment) గురవుతోంది. సర్వే నెంబర్ 439లో ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిన ప్రభుత్వ మిగులు గుట్ట భూమిని ఆక్రమించేస్తున్నారు. పట్టపగలే జేసీబీలు పెట్టి గుట్టలను పిండి చేస్తున్నారు. పచ్చని వృక్షాలను నేలమట్టం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న ఓ కార్పొరేటర్ ముఖ్య అనుచరుడే ఈ కబ్జా(Land Encroachment)కు తెరలేపాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో ప్రహరీ, పునాదులు నిర్మిస్తూ.. ప్రశ్నించినవారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. ‘మా వెనుక పెద్ద నాయకులు ఉన్నారు, అడ్డు వస్తే చంపేస్తాం’ అంటూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో కాలనీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే కబ్జాదారులకు వరం..
కళ్ల ముందే లక్షల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పరమవుతున్నా.. నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే కబ్జాదారులకు వరంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ తక్షణమే స్పందించి, ప్రగతి నగర్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ, స్థానికులను బెదిరిస్తున్న ఆక్రమణదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read : వందేమాతరానికి చట్టపరమైన రక్షణ
Follow Us On : WhatsApp

