కలం, జోగులాంబ గద్వాల : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (Jurala Project) ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అమరచింత మండలం నందిమల్ల ఎక్స్ రోడ్డులో రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆయకట్టు రైతులకు మద్దతుగా నిరసన తెలపడానికి జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రైతుల పంటలు ఎండిపోకుండా తక్షణమే నీటిని విడుదల చేయాలని చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయకట్టు రైతులు అడ్డుకున్నారు. పోలీసుల వాహనాలను చుట్టుముట్టి అరెస్టును నిరసించారు.
దీంతో రైతులు మరియు పోలీసుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు జూరాల ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది.

