కలం, వనపర్తి: రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి రంగంలో వనపర్తికి (Wanaparthy) మరో కీలక ప్రాజెక్టు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో చేపట్టనున్న క్లస్టర్-8 అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ పార్ట్‌నర్ (AIP) ప్రాజెక్టుకు రూ.241 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. ఈ క్లస్టర్‌కు వనపర్తి ప్రభుత్వ ఐటీఐని హబ్‌గా ఎంపిక చేశారు. హబ్ పరిధిలో మన్ననూరు, మహబూబ్‌నగర్ బాలికల ఐటీఐ, దిండి, గద్వాల ప్రభుత్వ ఐటీఐలను అనుసంధానించి సమగ్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
ప్రాజెక్టు అమలుతో వనపర్తి రాష్ట్రంలోనే ప్రముఖ నైపుణ్య శిక్షణా కేంద్రంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక ల్యాబ్‌లు, ఆధునిక యంత్రాలు, డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయడంతో పాటు రోబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్‌డ్ మానుఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.
పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం ద్వారా విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌లు, క్యాంపస్ నియామకాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ప్రభుత్వంతో ఎంపికయ్యే పరిశ్రమ భాగస్వామి ఐదేళ్లపాటు క్లస్టర్ నిర్వహణ బాధ్యతలు చేపట్టి మౌలిక వసతుల అభివృద్ధి, శిక్షణా నాణ్యత పెంపుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను తీర్చిదిద్దనున్నారు.
దీంతో గ్రామీణ యువతకు స్థానికంగానే ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు మంజూరుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఇన్‌చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

