కలం, జోగులాంబ గద్వాల: గద్వాల ఎమ్మెల్యే (Gadwal MLA) బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishna Mohan Reddy) జన్మదినాన్ని పురస్కరించుకుని, వారి సతీమణి బండ్ల జ్యోతి, తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి దంపతులు సోమవారం అలంపూర్ క్షేత్రంలోని శ్రీ జోగులాంబ అమ్మవారిని, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం అందజేసి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “శ్రీ జోగులాంబ అమ్మవారి దివ్య ఆశీస్సులతో గద్వాల నియోజకవర్గ ప్రజలు, రైతాంగం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో విలసిల్లాలని ప్రార్థించినట్లు” పేర్కొన్నారు.
గద్వాల జమ్ములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
అదే విధంగా గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ అమ్మవారి పరుశురాముని దేవాలయంలోనూ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి, వారి తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు.
ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ జమ్ములమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులతో గద్వాల నియోజకవర్గంలోని ప్రజలు, రైతాంగం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

