కలం, స్పోర్ట్స్ : కేవలం 36 సెకన్లు.. ఆ సమయంలోనే ఆరుగురు విద్యార్థుల తలపై ఉంచిన 26 యాపిల్స్‌ను చేతి దెబ్బలతో పగలగొట్టి జి.ఎస్. గోపాల్ రెడ్డి (Gopal Reddy) కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ వినూత్న ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జీవీఆర్ కరాటే అకాడమీ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్. గోపాల్ రెడ్డి అత్యంత కచ్చితత్వంతో ఈ సాహసాన్ని పూర్తి చేశారు. ఆరుగురు విద్యార్థుల తలపై ఉంచిన యాపిల్స్‌ను ఎలాంటి తప్పిదం లేకుండా వరుసగా చేతి దెబ్బలతో పగలగొట్టి రికార్డు నెలకొల్పారు.
ఈ రికార్డు ప్రయత్నంలో భార్గవ సాయి, ప్రణీత్, నైథిక్ రెడ్డి, సంజనా, తన్వి, చిన్మయి ప్రియా పాల్గొన్నారు. వారి ధైర్యం, క్రమశిక్షణ, పరస్పర నమ్మకం ఈ విజయానికి కీలకంగా నిలిచాయి. ఈ ఘనతను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ అధికారికంగా పరిశీలించి ధ్రువీకరించారు. గోపాల్ రెడ్డి సాధించిన ఈ రికార్డు కేవలం కరాటే ప్రతిభకు నిదర్శనం మాత్రమే కాదని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి క్రమశిక్షణ, క్రీడలు, ఫిట్‌నెస్‌తో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలనే బలమైన సందేశాన్ని అందిస్తోందని బింగి నరేందర్ గౌడ్ తెలిపారు.
ఈ విజయానికి సహకరించిన విద్యార్థులను కూడా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మహాలక్ష్మి రమణ గౌడ్, ఉమా రమేశ్ యాదవ్, వివేక్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ. కృష్ణారెడ్డి, నేతాజీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ కోట్ల నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే జీవీఆర్ కరాటే అకాడమీ బ్లాక్ బెల్ట్స్ కరీమ్, అమృతా రెడ్డి, గణ సంతోషిణి రెడ్డి, రాజు, సుధాకర్, అనఘ, షైనీ, ద్వైత కూడా హాజరయ్యారు.

