కలం, వెబ్ డెస్క్ : బంగారం, వెండి ధరలు (Gold Rates) భారీగా తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా చూస్తే బంగారం ధర (Gold Rates) క్రమంగా తగ్గుతూనే ఉంది. ఇంత పెద్ద మొత్తంలో తగ్గడం గత మూడు నెలల్లో ఇదే మొదటిసారి. సాధారణంగా యుద్ధాలు జరుగుతున్న టైమ్ లో బంగారం, వెండి ధరలు ఎక్కువగా పెరుగుతాయి. కానీ అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం జరుగుతుంటే గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోతున్నాయి. వాస్తవానికి ఈ యుద్ధం మొదలైనప్పుడు బంగారం ధరలు రూ.2లక్షలకు చేరుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇరాన్ దెబ్బకు బంగారం రేట్లు పడిపోతున్నాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,900 గా ఉంది. 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధరరూ.1,36,540లకు పడిపోయింది. అటు వెండి ధర కూడా కిలో రూ.2,59,900గా ఉంది. ఒకానొక దశలో బంగారం ధర లక్షా 60వేల దాకా వెళ్లింది. అటు వెండి కూడా మూడు లక్షలను టచ్ చేసింది. కానీ పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఇరాన్ వేసిన ప్లాన్ వల్లే..
ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేయడంతో పాటు.. తన చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీ కేంద్రాలను ఇరాన్ ధ్వంసం చేయడంతో.. ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ సప్లై ఆగిపోయింది. దీంతో క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలు క్రూడ్ ఆయిల్ ను కొనుగోలు చేయడానికి ఎక్కువ మొత్తంలో డాలర్లను కొనాల్సి వస్తోంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ బిజినెస్ డాలర్లలోనే జరుగుతుంది. యుద్ధం మొదలు కాకముందు డాలర్ విలువ ఈ స్థాయిలో లేదు. కానీ ఎప్పుడైతే ప్రపంచ దేశాలు క్రూడ్ ఆయిల్ కోసం ఎక్కువ డాలర్లను కొనడం స్టార్ట్ చేశాయో.. ఇన్వెస్టర్ల చూపు అటువైపు వెళ్లిపోయింది.
ఇన్వెస్టర్ల చూపు డాలర్ వైపు..
డాలర్ విలువ పెరిగినప్పుడు పెట్టుబడి దారులు అమెరికన్ ట్రెజరీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ టైమ్ లో గోల్డ్, సిల్వర్ మీద వాళ్లు పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోతాయి. ఇప్పుడు జరుగుతోంది కూడా ఇదే. గోల్డ్, సిల్వర్ మీద పెట్టుబడులు తగ్గి డాలర్ మీద పెరుగుతున్నాయి. అందుకే వారం రోజుల నుంచి గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోతున్నాయి. అటు గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ ధర కూడా తగ్గుతోంది. ఇలా గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గితే ఇండియాలో సేల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ లో పెళ్లిళ్ల సీజన్ కాబట్టి.. బంగారం ధరలు తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశమే.
లక్షకు తగ్గుతుందా..?
ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఇలాగే కొనసాగితే బంగారం, సిల్వర్ రేట్లు లక్షకు తగ్గుతాయేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఒక్కసారిగా అంత తక్కువకు పడిపోయే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో బంగారం ఎప్పుడూ ఒక సేఫ్ ఇన్వెస్ట్ మెంట్. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, ప్రకృతి విపత్తులు వచ్చినా, భూకంపాలు, సునామీలు బీభత్సం సృష్టించినా లేదంటే ఏదైనా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా.. ఆటోమేటిక్ గా గోల్డ్, సిల్వర్ మీద పెట్టుబడులు పెరుగుతాయి. ఎలాంటి విపత్తులనైనా తట్టుకుని నిలబడేది గోల్డ్ మాత్రమే. కాబట్టి గోల్డ్ రేట్లు మరీ అంత తక్కువ స్థాయికి ఇప్పటికిప్పుడు పడిపోవని చెబుతున్నారు. కాకపోయే యుద్ధం ఇంకొన్ని వారాలు కొనసాగితే.. బంగారం రేట్లు క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చు అంటున్నారు.

