ఆస్ప‌త్రిలో గ‌ర్భిణి మృతి.. మెడలో బంగారం మాయం!

కలం, భువనగిరి: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కేంద్రంలోని ప్ర‌భుత్వ‌ ఆసుపత్రిలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగుచూసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఒక గర్భిణి మెడలో మూడు తులాల బంగారు పుస్తెల తాడు మాయమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. వలిగొండ మండలం వర్కట్‌పల్లి గ్రామానికి చెందిన సుష్మిత గ‌ర్భిణి బుధ‌వారం తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె భర్త నాగరాజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. తెల్లవారుజామున సుష్మిత పరిస్థితి విషమించి కన్నుమూసింది. సుష్మిత మరణించిన కొద్దిసేపటికే ఆమె మెడలో ఉండాల్సిన మూడు తులాల బంగారు పుస్తెల తాడు కనిపించకుండా పోయింది.

ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆమె మెడలోనే ఉన్న బంగారం, మరణించిన తర్వాత మాయమవ్వడంపై కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది లేదా మరెవరైనా దొంగతనానికి పాల్పడి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. న్యాయం జరగాలంటూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగారు గొలుసు మాయమవ్వడంపై మృతురాలి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రిలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>