కలం, వెబ్ డెస్క్ : గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri )అన్నారు. శుక్రవారం డా.బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన “మహువా ఫ్లవర్ ప్రాజెక్ట్ అమలు”పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క , రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వర్క్ షాప్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, పోషకాహార భద్రత, మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇప్ప పువ్వు ఆధారిత ప్రాజెక్టులను రూపొందిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకొని పనిచేస్తోందని మంత్రి అన్నారు. గిరిజన ఆర్థిక స్వావలంబనకు ”ఇప్ప పువ్వు” ప్రాజెక్ట్ దిక్సూచి అని సూచించారు. అడవుల్లో సహజసిద్ధంగా లభించే ఇప్ప పువ్వు గిరిజన సంస్కృతి, ఆహార సంప్రదాయాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో సహజసిద్ధంగా లభించే ఇప్ప పువ్వు నుండి లడ్డూలు, నాచురల్ హెల్త్ ఫుడ్స్, సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేయవచ్చని, ఇప్ప గింజల నుండి నూనె తయారీకి కూడా విశేష అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆకులు, పువ్వులు, గింజలు అన్నీ వినియోగంలోకి తీసుకువస్తే గిరిజన ప్రాంతాల్లో చిన్న స్థాయి పరిశ్రమలు ఏర్పడి మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఇప్ప పువ్వుతో పోషకాహార పదార్థాలు, పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్స్, మిల్లెట్ ఆధారిత ఫుడ్ ప్రొడక్ట్స్, హర్బల్ టీలు, నాచురల్ స్వీటెనర్లు తయారు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. గిరిజన మహిళల సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేస్తే ప్రపంచ మార్కెట్‌లో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావచ్చని వెల్లడించారు.

