ఎవ‌రూ ఊహించ‌ని విష‌యాలు వెల్ల‌డించిన సీఎం రేవంత్‌!

కలం, తెలంగాణ బ్యూరో: ఇప్పుడంతా ‘స్విగ్గీ’ పాలిటిక్స్ నడుస్తున్నాయని, ఆర్డర్ ఇచ్చిన వెంటనే డోర్ డెలివరీ అయ్యే తరహాలో కొందరు పొలిటీషన్లు వ్యవహరిస్తున్నారని, కానీ తాను ఆ కేటగిరీ వ్యక్తిని కానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) క్లారిటీ ఇచ్చారు. ఒక స్పష్టమైన విజన్‌తోనూ, వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పి మరీ బయటకు వచ్చానని వివరించారు. పాలన పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల తనకు క్లారిటీ ఉన్నదని, అందుకే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నారు. ‘గాంధీ’ ఫ్యామిలీతో మంచి అటాచ్‌మెంట్ ఉన్నదని, అయినా తాను గీత దాటనన్నారు. పదేండ్ల పాటు తెలంగాణ సీఎంగా ఉంటానని, 2034 ఎన్నికల తర్వాత 100 సీట్లు వచ్చినా తాను కంటిన్యూ కానని, ఇతరులకు అవకాశం ఉంటుందన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం తన టాస్క్ అని, ఆ తర్వాత ఆయన ఏ చైర్ ఇచ్చినా బాధ్యతగా పనిచేస్తానని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానన్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన కాంక్లేవ్‌లో తన అభిప్రాయాలన్నింటినీ పంచుకున్నారు.

ప్రధాని కావాలన్న ఆశ, కోరిక నాకు లేదు :

దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలన్నదే తన లక్ష్యమని, కానీ ప్రధాని సీట్లో కూర్చోవాలన్న అత్యాశ లేదని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా 2034 వరకు ఉంటానని, ఆ తర్వాత జాతీయ స్థాయికి వెళ్తానని, ప్రజల మధ్యనే ఉంటానన్నారు. రాహుల్‌గాంధీని ‘ఇండియా’ కూటమి తరఫున ప్రధానిని చేయడానికి ముందుగానే భాగస్వామ్య పార్టీలన్నింటినీ ఒప్పిస్తానన్నారు. ఒక పాలసీ డాక్యుమెంట్‌ను ప్రజల ముందు ఉంచి ఇండియా కూటమిని గెలిపించాలని కోరుతామన్నారు. ‘స్విగ్గీ’ పాలిటిక్స్ గురించి వివరిస్తూ, తెలుగుదేశం పార్టీలో పదేండ్లు పనిచేశానని, వ్యక్తిగత పొలిటికల్ ఫ్యూచర్‌ను ఎంచుకుని చంద్రబాబుకు చెప్పిన తర్వాతే పార్టీ నుంచి బయటకు వచ్చానని, ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. పార్టీని వదిలిన తర్వాత కూడా అలాంటి రిలేషన్ చాలా అరుదన్నారు.

అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియ :

జూబ్లీహిల్స్ నుంచి గ్రామాల‌కు వెళ్లిన తనకు రాజకీయాలతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉండాలో తెలుసన్నారు. గ్రామంలో పేద రైతులు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌ద‌వే విద్యార్థులు ఎలా ఉంటారో తెలుసని, ప్రభుత్వాలు మారినా పాలసీలు, పథకాలు కొనసాగాలన్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు, పార్టీలే శాశ్వ‌తం తప్ప ప్ర‌భుత్వాలు మారుతూ ఉంటాయన్నారు. అభివృద్ధి ఎప్పుడైనా దీర్ఘకాలిక దృష్టితో చేయాలని, అందుకే కాంగ్రెస్ పవర్‌లో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీఐఆర్ కారిడార్, మెట్రో రైల్.. ఇలాంటివన్నీ వచ్చాయన్నారు. స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న‌ప్పుడు మానసిక ఒత్తిడి ఉంటుందని, కానీ దాన్ని అధిగ‌మించ‌డానికి ఆలోచించుకోవాలన్నారు. ప్ర‌జాప్ర‌తినిధిగా ఆలోచ‌న‌లో తనకు స్ప‌ష్ట‌త ఉన్నదని, కొంద‌రికి భిన్నాభిప్రాయాలు ఉన్నా అంద‌రినీ మెప్పించ‌లేమన్నారు.

ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రాజెక్టును వదలను :

దాదాపు 17 ఏళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలోనే ఉన్న తనకు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైన అవ‌గ‌హ‌న ఉందన్నారు. ప్ర‌పంచ దిగ్గజ సంస్థ‌లను ఆహ్వానించి గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిర్వ‌హించామని, తెలంగాణ రైజింగ్ 2047 పాల‌సీ డాక్యుమెంట్ రూప‌క‌ల్ప‌న‌లో భాగ‌స్వాముల‌ను చేశామన్నారు. సుమారు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించడంతో పాటు రాష్ట్ర మొత్తం అభివృద్ధికి అనుగుణంగా క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు భాగాలతో సమాన అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయన్నారు. కాలుష్య ప‌రిశ్ర‌మ‌ల‌ను త‌ర‌లిస్తున్నామన్నారు. చెరువులు, కుంట‌లు, నాలాలు, ప‌బ్లిక్ పార్కులు, ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను ఆక్ర‌మించుకుంటే ప్ర‌కృతి క్ష‌మించ‌దన్నారు. “యుద్ధం జ‌రిగిన‌ప్పుడు కొంద‌రు అమాయ‌కులు కూడా చ‌నిపోతారు.. అది యుద్ధ నీతి.. ఆక్ర‌మ‌ణ‌ల‌దారుల‌కు ముందే నోటీసులు ఇస్తున్నాం.. ఏదీ నేను నా కోసం, నా ఇంటికి కోసం చేయ‌డం లేదు.. ప్ర‌జ‌ల కోసం చేస్తున్న‌.. కొన్ని తిట్లు భ‌రిస్తా… చెరువులు ఆక్ర‌మించుకున్న వారికి డ‌బ‌ల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నాం.. మూసీలో అక్ర‌మంగా ఉంటున్నవారిని ప్ర‌భుత్వం ఉదారంగా ఆదుకుంటుంది.. డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లు క‌ట్టిస్తాం.. విద్య‌, వైద్యం అందిస్తామ‌ని హామీ ఇచ్చాం.. ఎవ‌రూ మూసీ మురికిలో ఉండాల‌ని కోరుకోరు..” అని విజన్‌ను వివరించారు.

శంషాబాద్‌లో బుల్లెట్ ట్రెయిన్ హబ్‌ :

ఔట‌ర్ రింగ్ రోడ్డు నుంచి రీజ‌న‌ల్ రింగ్ రోడ్డు మ‌ధ్య‌లో రేడియ‌ల్ రోడ్లు నిర్మిస్తున్నామని వివరించిన సీఎం.. కేంద్ర ప్ర‌భుత్వం ఏడు బుల్లెట్ ట్రైన్లు ఇస్తే అందులో మూడు తెలంగాణ‌కే తెచ్చుకున్నామన్నారు. శంషాబాద్ కేంద్రంగా బుల్లెట్ హ‌బ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, రోడ్డు, ఎయిర్, నేవీ పోర్టు క‌నెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రియ‌ల్ ఎస్టేట్ బాగున్నా తాను ఆశించిన‌ట్లు లేదన్నారు. ప్ర‌పంచవ్యాప్తంగానే ర‌క‌ర‌కాల కార‌ణాలతో గ్రోత్ తగ్గిందన్నారు. కొంతమంది సోష‌ల్ మీడియాలో పెట్టుబ‌డి పెట్టి వాళ్లే రాసి వాళ్లే చూసి వాళ్లే సంతోషిస్తున్నారని పరోక్షంగా బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. “వాళ్లు భ్ర‌మ‌ల్లో ఉన్నారు.. నేను వాస్త‌వంలో ఉంటా.. ఉహ‌జ‌నిత‌మైన ప్ర‌పంచంలో ఉండ‌ను.. వార‌స‌త్వంగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని కొంద‌రు క‌ల‌లు క‌న్నారు.. ఇలాంటివి చాలా ఉదాహ‌ర‌ణ‌లున్నాయి..” అని అన్నారు.

రాష్ట్ర, దేశ అభివృద్ధికి మ‌హిళ‌లు గ్రోత్ ఇంజ‌న్ :

గత రెండు విద్యా సంవ‌త్స‌రాల్లో ప్ర‌భుత్వ స్కూల్స్‌లో జీరో డ్రాప్ఔట్స్ ఉన్నాయని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను సంస్కరిస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ డెవలప్‌‌మెంట్.. ఇవన్నీ అందులో భాగమేనన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణం ఇవ్వ‌డం వ‌ల్ల విద్యార్థినుల‌కు ఖర్చు లేకుండా చేశామని, రాష్ట్రంలోని సగం జనాభా ఉచితంగా ట్రావెల్ చేస్తున్నారని అన్నారు. ఈ స్కీమ్ వచ్చిన తర్వాత 28 నెల‌ల్లో ఆర్టీసీకి రూ. 10 వేల కోట్లను రీఇంబర్స్ చేశామన్నారు. స‌గ‌టున ప్రతీ మ‌హిళ రూ. 10 వేలు ఆదా చేసుకున్నారన్నారు. ఆర్టీసీ దివాలా తీస్తుందని చాలా మంది అనుకున్నా లాభాల బాట ప‌ట్టించామన్నారు. ప్ర‌తి నెలా ఆర్టీసీకి రూ. 350 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. ఆదా అవుతున్న డబ్బుతో మ‌హిళ‌లు అనేక ర‌కాలుగా ల‌బ్దిపొందుతున్నారని తెలిపారు. హైద‌రాబాద్ ప‌రిధిలో డీజీల్ బ‌స్సుల స్థానంలో ఈవీలను తెస్తున్నామన్నారు. ప్రతి నెలా ఆర్టీసీకి రూ. 2 వేల కోట్ల డీజిల్ ఖ‌ర్చును ఆదా చేస్తామన్నారు. మ‌హిళ‌ల‌కు శ‌క్తిని ఇస్తున్నామన్నారు.

డ్రగ్స్ తల్చుకుంటేనే వణుకు పుట్టాలి :

రాష్ట్రంలో డ్ర‌గ్స్‌ను కంట్రోల్ చేయ‌డానికి ‘ఈగ‌ల్ ఫోర్స్’ను తీసుకొచ్చామని, విద్యార్థులతో త్వరలో ప్రతిజ్ఞ చేయిస్తున్నామన్నారు. ఫామ్ హౌజ్‌లలో పార్టీలు చేసుకుని దొరికిపోయినవారు ఇప్పుడు తనను విమ‌ర్శిస్తున్నారని తెలిపారు. దీపావ‌ళి రోజున చిచ్చుబుడ్లు కాల్చాలి కాని మందుబుడ్లు పెడ‌తానంటే ఎలా అని ప్రశ్నించారు. గంజాయిని నియంత్రిస్తుంటే విమ‌ర్శిస్తూ విల‌న్‌గా చూస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా తాను 100 శాతం సంతృప్తితో ఉన్నానని, భ‌విష్య‌త్తు త‌రాల కోసం ఏదైనా చేయాల‌న్న‌దే తన ఆలోచ‌న‌ అని అన్నారు. మేడిగ‌డ్డ నిర్మిస్తే మేడిపండులా కూలిపోయిందని, స‌గం జ్ఞానంతో చేస్తే ఇలాగే అవుతుందన్నారు. ఇప్పుడు తాను సోష‌ల్ ఇంజ‌నీరింగ్ చేస్తున్నాని చెప్పారు. మాన‌వ సంబంధాలు తెగిపోతున్నాయని, విలువ‌లు పోతున్నాయని, వీటిని నిల‌బెట్టాల్సిన బాధ్య‌త పాల‌కుడిగా తనకున్నదన్నారు. రోజూ 18 గంట‌లు అధికారుల‌తో స‌మీక్ష‌లు చేస్తున్నానని గుర్తుచేశారు.

సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు :

సోనియాగాంధీ లేకుంటే వెయ్యేళ్లయినా తెలంగాణ వ‌చ్చేది కాదని సీఎ, అన్నారు. కాంగ్రెస్‌లో తాను చేరిన‌ప్పుడు అధికారంలో లేదని, అయినా చేరానని గుర్తుచేశారు. మ‌న‌సుకు న‌చ్చిన‌ట్లే చేస్తా తప్ప అవ‌కాశాల కోసం అవ‌కాశ‌వాదిగా మార‌నన్నారు. నిబ‌ద్ద‌త‌తో పార్టీలో చేరినందునే గాంధీ కుటుంబం తనకు అవ‌కాశం ఇచ్చిందన్నారు. ప్ర‌ధానిగా మోదీ, ముఖ్య‌మంత్రిగా తాను అధికారిక కార్య‌క్ర‌మంలో మాట్లాడుకున్నామని, గత ప్రభుత్వం కేంద్రంతో కయ్యం పెట్టుకున్నదన్నారు. నిధుల కోసం క‌లిసి రావాల‌టూ ప్ర‌ధాని అడిగారే తప్ప వ్యక్తిగతంగా కాదన్నారు. రాజ‌కీయాల్లో తన క‌మిట్‌మెంట్ గురించి ప్ర‌ధానికి తెలుసన్నారు. మైక్‌ల ముందే మాట్లాడుకున్నాం తప్ప ర‌హస్యం లేదన్నారు. ప్రధాని కామెంట్‌తో తనకున్న పొలిటికల్‌గా ఉన్న డిమాండ్ తేలిందన్నారు. తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం ఇది అన్నారు.

సామాజిక బాధ్యతతోనే పదవులు, పథకాలు :

ముఖ్యమంత్రిగా వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌ట్టాలెక్కించాల్సిన బాధ్య‌త తనపై ఉన్నదని, అందుకే ప్ర‌తీ రెండు వారాలకు ఒకసారి ఒక సారి జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్తున్నానని తెలిపారు. నిధుల స‌మీక‌ర‌ణ పైన ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నానని తెలిపారు. జ‌డ్పీటీసీగా ఉన్న‌ప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో ఇప్పుడు సీఎం స్థాయిలోనూ అదే ఇంట్లో ఉన్నానని గుర్తుచేశారు. క‌ష్ట‌ప‌డ్డ నాయ‌కుల‌కే నామినేటేడ్ పోస్టులు ఇస్తున్నామని, ఇందిర‌మ్మ ఇంట్లో ఉండే వెడ్మ బొజ్జుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామన్నారు. చాక‌లి ఐల‌మ్మ కుటుంబం, శ్రీకాంతాచారి కుటుంబం, కోదండ‌రాం, ఆకునూరి ముర‌ళి.. ఇలా అంద‌రినీ గుర్తు పెట్టుకుని ప‌ద‌వులు ఇచ్చామన్నారు. ‘జ‌య జ‌య‌హే తెలంగాణ..’ గీతాన్ని రాష్ట్ర గీతం చేశామని, తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎవ‌రు అడ్డువ‌చ్చినా మూసీని ప్ర‌క్షాళ‌న చేసి తీరుతామన్నారు.

బండి సంజయ్ తన కొడుకుని అప్పగించాలి :

మ‌హిళ‌ల‌పైన నేరాల‌ను ప్రభుత్వం నియంత్రించక తప్పదని, ఓ మైన‌ర్ బాలిక త‌ల్లి పేట్‌బ‌షీరాబాద్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేస్తే నేర స్వభావం తీవ్రతకు అనుగుణంగా సెక్ష‌న్లు కూడా మార్చి కేసు పెట్టామన్నారు. అమ్మాయి స్టేట్‌మెంట్‌ను తీసుకుని వెంట‌నే నోటీసులు జారీ చేశామన్నారు. తొందరపడి ఉంటే 1000 మంది పోలీసుల‌ను తీసుకుని ఇంటి మీద పడ్డారని విమ‌ర్శ‌లు చేసేవారన్నారు. సినిమా వాళ్లు, రాజ‌కీయ నాయ‌కులు.. ఎవ‌రైనా మిన‌హాయింపులు ఉండవన్నారు. పోక్సో కేసు పెట్టామంటేనే మహిళల భద్రత పట్ల తన క‌మిట్‌మెంట్ ఏమిటో తెలుసుకోవచ్చన్నారు. హోంమంత్రి గానే కాకుండా ముఖ్య‌మంత్రిగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం తన బాధ్య‌త‌ అన్నారు. కుమారుడి విషయంలో బండి సంజయ్ తీరు నైతికంగా త‌ప్పు అని సీఎం వ్యాఖ్యానించారు. “బండి సంజ‌య్ కేసు విచారణను దైర్యంగా ఎదుర్కొవాలి.. కొడుకు త‌ప్పిదం వ‌ల్ల త‌ల‌వంపులు వ‌చ్చాయి.. బండి సంజ‌య్ నిల‌బ‌డి స‌మాధానం చెప్పాలి.. కొడుకును తీసుకువ‌చ్చి స్టేష‌న్‌లో అప్ప‌గించాలి..” అని అన్నారు

బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంటున్నది :

బండి సంజ‌య్‌కు, బీఆర్ఎస్ మ‌ధ్య ఎక్క‌డ చెడిందో తనకు తెలియ‌దని, కానీ బండి సంజయ్ కుమారుడి విషయాన్ని మాత్రం రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నదని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ విలీనాన్ని బండి సంజ‌య్ వ్య‌తిరేకించాడ‌నే కోప‌ముందేమోననిన్నారు. బీఆర్ఎస్‌లో ఉన్న ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీస‌ర్ కాదని, ఫోక్సో కేసు పెడితే బెదిరించిన‌ట్లా లేక బాధితురాలి ప‌క్షాన ఉన్న‌ట్లా అని ప్రశ్నించారు. కేటీఆర్, బండి సంజ‌య్ మ‌ధ్య ఏమున్నదో తనకు తెలియ‌దని, కానీ పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు సంబంధించిన అంశలో ఏ చిన్న త‌ప్పు చేసినా పిల్ల‌ల జీవితాలు నాశ‌నమవుతాయన్నారు. అమ్మాయికి రెండు బ‌ర్త్ స‌ర్టిఫికెట్స్ ఉన్నాయని, వాటిని పోలీసులు విచారించాలి క‌దా అని అన్నారు. ఆల‌స్యం అయినా శిక్ష నుంచి మాత్రం త‌ప్పించుకోలేరని స్పష్టం చేశారు. “నేను స‌త్రం న‌డ‌ప‌డం లేదు.. ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నా.. 100 శాతం బాధితుల‌కు మా ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది.. త‌ప్పు చేసిన వారిని శిక్షిస్తాం.. నాలుగు నెల‌ల ముందు జరిగిన ఘటనపై విచారించాలంటే స‌మ‌యం ప‌డుతుంది..” అని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>