కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జె. జయలలితకు చెందిన హైదరాబాద్‌లోని ఆస్తిని (Jayalalithaa Property) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు మంగళవారం సీజ్ చేశారు. యూసుఫ్‌గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ 38 పరిధిలోని శ్రీనగర్ కాలనీలో జయలలిత పేరుపై ఉన్న ఈ భవనానికి సంబంధించి గత కొన్నేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
మున్సిపల్ రికార్డుల ప్రకారం 2017 నుంచి ఈ భవనానికి సంబంధించిన పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ఈ క్రమంలోనే గత ఫిబ్రవరి నెలలో ఉప కమిషనర్ సురేశ్ సదరు భవన నిర్వాహకులకు, జయలలితకు సంబంధించిన వ్యక్తులకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై అటు వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, జీహెచ్ఎంసీ ఏఎంసీ బాల్‌రాజ్ ఆధ్వర్యంలో సిబ్బంది భవనం (Jayalalithaa Property) వద్దకు చేరుకుని సీజ్ ప్రక్రియను పూర్తి చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకం గడువు మార్చి 31తో ముగుస్తున్న తరుణంలో, రాయితీలు పోను ఇంకా 82,91,822 రూపాయల మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గడువులోగా స్పందించని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
Read Also: శీతల మాతా ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది భక్తులు మృతి
Follow Us On : WhatsApp

